ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపు (ఫిబ్రవరి 24) ప్రారంభం కానున్నాయి. దాదాపు ఏడు నెలల విరామం తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ అసెంబ్లీకి హాజరుకానుండడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో, రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు ఘాటు విమర్శలు చేశారు. ఇన్నాళ్లు అసెంబ్లీకి రాకుండా జగన్ అజ్ఞాతంలో ఉన్నారని, ఇప్పుడు మాత్రం హాజరవుతున్నారని అన్నారు.

తన పదవి కాపాడుకోవడానికి ప్రయత్నం
జగన్ అసెంబ్లీకి వస్తున్నదంతా ప్రజలపై ప్రేమతో కాదని, ప్రజా సమస్యలపై చర్చించేందుకూ కాదని, తన ఎమ్మెల్యే పదవి పోతుందనే భయంతోనే వస్తున్నారని నిమ్మల ఆరోపించారు. ప్రజలకు ఐదేళ్లు మోసం చేసిన జగన్, చివరకు తన పదవి కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన జగన్, ఇప్పుడు అసెంబ్లీకి వస్తున్నారని, ఇది పూర్తిగా ఆయన స్వార్థ ప్రయోజనాల కోసమేనని నిమ్మల మండిపడ్డారు.
జగన్ ఐదేళ్ల పాలన పూర్తిగా దోపిడీ
జగన్ ఐదేళ్ల పాలన పూర్తిగా దోపిడీ, విధ్వంసాలతో నిండిపోయిందని, అందుకే ప్రజలు ఆయనను తిరస్కరించారని మంత్రి నిమ్మల ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి, అభివృద్ధిని కూనిరాగం పెట్టిన జగన్‌కు ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ఇంటికి సాగనంపారని వ్యాఖ్యానించారు. ప్రజలు జగన్ వైఖరిని గమనిస్తూ ఉన్నారని, ఇకపై ఆయన మాయలు పనిచేయవని నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు.