- రైతులకు మేలు చేయని వ్యక్తి జగన్
- జగన్ వ్యాఖ్యలకు ప్రజలు నవ్వులు
గుంటూరు మిర్చి యార్డు వద్ద జరిగిన కార్యక్రమంలో మాజీ సీఎం జగన్ పై రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ తన పాలనలో రైతులకు ఒక్క మంచి పని చేయలేదని విమర్శించారు. రైతులకు మేలు చేయని వ్యక్తి, ఇప్పుడు రైతులపైనా అబద్ధాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ చేసిన వ్యాఖ్యలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, “జగన్ తన హయాంలో రైతుల నుంచి ఒక్క గింజ కూడా కొనలేదు. నష్టపోయిన రైతులకు ఏదైనా సహాయం అందించారా? ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఒక్క పైసా ఇచ్చారా?” అని ప్రశ్నించారు. గత పాలనలో డ్రిప్పులు, ఎరువులు, గిట్టుబాటు ధర వంటి ప్రాధాన్యత అంశాలను జగన్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. రైతుల గురించి జగన్ మాట్లాడడం హాస్యాస్పదంగా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు.
“మేము అధికారంలోకి వచ్చి ఆరునెలలు కూడా కాకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు. రైతుల కోసం మేము తీసుకొచ్చిన మార్పులను ప్రజలు స్వాగతిస్తున్నారు. అయితే, జగన్ వంటి నాయకులు అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు” అని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.