తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Houses) లబ్ధిదారులకు మేలు చేసేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇళ్ల నిర్మాణం చేపట్టుతున్న ప్రజలకు ముడి సరుకుల ఖర్చు భారంగా మారుతున్న నేపథ్యంలో, ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ముఖ్యంగా సిమెంట్, స్టీల్ వంటి నిర్మాణ సామగ్రిపై అధిక డిమాండ్ ఉండటంతో వాటి ధరలు వేగంగా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితిని అదుపులోకి తేవాలనే ఉద్దేశంతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.
ధరల నియంత్రణకు కమిటీ ఏర్పాటు
ఈ కమిటీకి రాష్ట్రస్థాయిలో చీఫ్ సెక్రటరీ (CS) చైర్మన్‌గా నియమించబడగా, జిల్లా స్థాయిలో కలెక్టర్లను ఛైర్మన్‌లుగా నియమించారు. కమిటీ బాధ్యతగా సిమెంట్, స్టీల్ ధరలపై పరిశీలన చేసి ఒక నిర్ణీత ధరను నిర్ణయిస్తుంది. ఆ ధరలకే లబ్ధిదారులకు ముడి సరుకులు అందేలా చర్యలు తీసుకోనున్నారు. ఇది ప్రజలపై ఆర్థికభారాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషించనుంది.
ఇసుక ఉచితం.. నిర్మాణం వేగవంతం
ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఉచితంగా ఇసుకను అందించాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. దీనివల్ల ఇళ్ల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసుకునే అవకాశం కలుగుతోంది. ఇప్పుడు సిమెంట్, స్టీల్ ధరల నియంత్రణతో పాటు ఇసుక ఉచిత పంపిణీ కూడా కలిస్తే, లబ్ధిదారులకు భారీగా ప్రయోజనం చేకూరనుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో మరింత వేగం రావడంతో పాటు, సామాన్యులకు సొంతింటి కల నెరవేరే అవకాశం కనిపిస్తోంది.
Read Also : Heavy Rain : ఇవాళ రాత్రి భారీ నుంచి అతిభారీ వర్షం