భద్రాచలం వద్ద గోదావరి (Godavari ) నదికి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ప్రస్తుతం అక్కడ నీటిమట్టం 50.3 అడుగులకు చేరుకోవడంతో, రెండో ప్రమాద హెచ్చరిక అమలవుతోంది. గోదావరి పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో ఎగువ నుంచి వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. అధికారులు సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నారు. భద్రాచలం వద్ద ఉన్న వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
ధవళేశ్వరం, ప్రకాశం బ్యారేజీల వద్ద పరిస్థితి
ధవళేశ్వరం కాటన్ బ్యారేజి వద్ద కూడా గోదావరికి వరద భారీగా వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) విడుదల చేసిన సమాచారం ప్రకారం, ధవళేశ్వరం వద్ద ప్రస్తుతం 9.75 లక్షల క్యూసెక్కుల ఇన్, ఔట్ ఫ్లో కొనసాగుతోంది. ఉదయం 11 గంటల లోపు అక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశముందని అధికారులు తెలిపారు. మరోవైపు, కృష్ణా నదిపై ఉన్న ప్రకాశం బ్యారేజీ వద్ద కూడా వరద ప్రవాహం పెరిగింది. అక్కడ ప్రస్తుతం 5.04 లక్షల క్యూసెక్కుల ఇన్, ఔట్ ఫ్లో ఉండగా, మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.
ప్రజల భద్రతకు ముందస్తు చర్యలు
ప్రస్తుత వరద పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, గోదావరి, కృష్ణా నదుల పరీవాహక ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేశారు. అధికార యంత్రాంగం ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తోంది. వరద ముంపునకు గురయ్యే అవకాశం ఉన్న గ్రామాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు ఇచ్చే సూచనలను పాటించాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. అత్యవసర సహాయం కోసం హెల్ప్‌లైన్ నంబర్‌లను సంప్రదించవచ్చని తెలిపారు.