హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ తీరం గణేశ్ నిమజ్జన (Ganesh Immersion) వేడుకలతో సందడిగా మారింది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ గణనాథులు ఊరేగింపుగా వచ్చి నిమజ్జనంలో పాల్గొంటున్నారు.
బాలాపూర్ గణేశుడు నిమజ్జనం
గణేశ్ ఉత్సవాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన బాలాపూర్ గణేశుడు(Balapur Ganesh) కొద్దిసేపటి క్రితమే హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనమైపోయాడు. క్రేన్ నంబర్ 12 వద్ద భారీ క్రేన్ సహాయంతో ఈ భారీ విగ్రహాన్ని గంగమ్మ ఒడికి చేర్చారు. ఈ క్రమంలో నిమజ్జనాన్ని వీక్షించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బాలాపూర్ గణేషుడి లడ్డూ వేలంపాట కూడా ఈ ఏడాది రికార్డు ధర పలికిన సంగతి తెలిసిందే.
హుస్సేన్ సాగర్ వద్ద భక్తుల కోలాహలం
హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్న ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్ ప్రాంతాల్లో వేలాది మంది భక్తులు నిమజ్జన వేడుకల్లో పాల్గొంటూ ఆనందోత్సాహాలతో ఉన్నారు. నగరంలో వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన గణనాథుల నిమజ్జనం కోసం భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ వేడుకలు రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగే అవకాశం ఉంది.