జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళనను రేపింది. ఈ నేపథ్యంలో ఖతార్ దేశం భారత్‌కు తన పూర్తి మద్దతును ప్రకటించింది. ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ మంగళవారం భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్‌లో మాట్లాడారు. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన ఆయన, ఈ క్లిష్ట సమయంలో భారత ప్రజలతో తమ దేశం గాఢమైన సంఘీభావాన్ని వ్యక్తం చేస్తోందని తెలిపారు.
పహల్గామ్ ఉగ్రదాడి ప్రధానంగా చర్చ
ఫోన్ సంభాషణలో పహల్గామ్ ఉగ్రదాడి ప్రధానంగా చర్చకు వచ్చింది. ఈ దాడికి పాల్పడిన వారిని గుర్తించి, చట్టం ఎదుట తీసుకురావడంలో భారత్ చేసే ప్రయత్నాలకు ఖతార్ పూర్తి సహకారం అందిస్తుందని అమీర్ హామీ ఇచ్చారు. ఉగ్రవాదం లాంటి అభిశాపాన్ని అంతమొందించేందుకు అంతర్జాతీయంగా సమగ్రంగా పని చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఖతార్ అమీర్ కు మోడీ ధన్యవాదాలు
ఖతార్ అమీర్ వ్యక్తీకరించిన మద్దతుకు ప్రధాని నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఇరు నాయకులు భారత్-ఖతార్ దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలంగా తీర్చిదిద్దుకోవాలని సంకల్పించారు. ఈ ఏడాది ప్రారంభంలో అమీర్ చేసిన భారత పర్యటన సందర్భంగా తీసుకున్న నిర్ణయాల అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని వారు నిర్ణయించారు. భవిష్యత్తులో సాంకేతికం, వాణిజ్యం, భద్రత రంగాలలో ఇరు దేశాల మధ్య మరింత సహకారం జరగాలని నేతలు అభిప్రాయపడ్డారు.
Read Also : Good News : రేషన్ కార్డులు లేనివారికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్