తెలంగాణలో పెట్టుబడుల సమీకరణకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం చేసుకుంటున్న ఒప్పందాలపై (MoUs) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, జాగృతి చీఫ్ కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రభుత్వం విదేశీ పర్యటనల్లో కుదుర్చుకుంటున్న ఒప్పందాలు కేవలం ప్రచారానికే పరిమితమయ్యాయని కవిత విమర్శించారు. ముఖ్యంగా ‘సింగపూర్ గేట్వే’ అనే సంస్థకు కనీసం వెబ్సైట్ కూడా లేకపోవడంపై ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కనీస ఉనికి లేని కంపెనీలతో వేల కోట్ల రూపాయల ఒప్పందాలు ఎలా చేసుకుంటారని ఆమె ప్రశ్నించారు. పెట్టుబడుల పేరుతో ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోందని, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితి వేరుగా ఉందని ఆమె ఆరోపించారు.
YSRCP: చంద్రబాబు ప్రభుత్వంపై రోజా తీవ్ర విమర్శలు
దాదాపు 70 వేల కోట్ల రూపాయల భారీ పెట్టుబడి పెడతామన్న ‘ఇన్ఫ్రా కీ డేటా సెంటర్ పార్క్’ కంపెనీ విశ్వసనీయతను కవిత తప్పుబట్టారు. ఈ సంస్థ గతేడాదే ఏర్పడిందని, ఇది కేవలం వివిధ దేశాలతో ఒప్పందాలు (MoUs) చేసుకోవడానికే పుట్టినట్లు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. ఇప్పటికే ఈ సంస్థ అమెరికాలో 90 వేల కోట్లు, బ్రెజిల్లో 70 వేల కోట్ల రూపాయల ఒప్పందాలు చేసుకుందని.. అసలు ఇంత భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టే సామర్థ్యం ఆ సంస్థకు ఉందా? అని ఆమె నిలదీశారు. పెట్టుబడి విలువ కంటే తక్కువ మూలధనం ఉన్న కంపెనీలు వేల కోట్ల ఒప్పందాలు చేయడం వెనుక ఉన్న మర్మాన్ని బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
ప్రభుత్వ ఒప్పందాల్లో పారదర్శకత లోపించిందని, ముఖ్యంగా జయవీర్ రెడ్డికి సంబంధించిన కంపెనీల వ్యవహారంపై స్పష్టత ఇవ్వాలని కవిత కోరారు. 10 లక్షల రూపాయల మూలధనం కూడా లేని కంపెనీలు రాష్ట్రానికి వేల కోట్ల పెట్టుబడులు ఎలా తెస్తాయని ఆమె ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో వచ్చిన పెట్టుబడులను తమ ఖాతాలో వేసుకోవడమే కాకుండా, కొత్తగా వచ్చేవి కూడా కట్టుకథలేనని ఆమె విమర్శించారు. ప్రభుత్వం తక్షణమే ఈ కంపెనీల పూర్తి వివరాలను, వాటి ఆర్థిక స్థితిగతులను బహిర్గతం చేయాలని ఆమె పట్టుబట్టారు.