అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులను స్వదేశాలకు తిరిగి పంపించేందుకు ట్రంప్ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో, స్వచ్ఛందంగా తమ దేశాలకు వెళ్లే వారిని ప్రోత్సహించేందుకు ప్రతిదీ సిద్దం చేసింది. ఈ పథకం కింద, తమ స్వదేశానికి తిరిగి వెళ్లే వారికి 1000 డాలర్ల నగదు ప్రోత్సాహకంతో పాటు ప్రయాణ ఖర్చులు కూడా ప్రభుత్వం భరిస్తుందని అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ఒక ప్రకటనలో తెలిపింది.
‘CBP One’ అనే ప్రత్యేక మొబైల్ యాప్
ఈ కార్యక్రమం అమలు కోసం ‘CBP One’ అనే ప్రత్యేక మొబైల్ యాప్‌ను రూపొందించారు. ఈ యాప్ ద్వారా అక్రమ వలసదారులు తమ వివరాలు నమోదు చేసుకుని, తిరిగి వెళ్ళినట్లు ధృవీకరించిన తర్వాత, వారికి ప్రోత్సాహక మొత్తాన్ని అందజేస్తారు. ఈ విధానం ద్వారా వలసదారుల బహిష్కరణకు అయ్యే ఖర్చు 70% వరకు తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఒక్కొక్కరి బహిష్కరణకు సగటున 17,000 డాలర్లకు పైగా ఖర్చవుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
వలసదారులు అరెస్టుకు లోనవకుండా, చట్టపరమైన పరిష్కారం
ఈ పథకం అమలుతో వలసదారులు అరెస్టుకు లోనవకుండా, చట్టపరమైన పరిష్కారంగా స్వదేశానికి తిరిగి వెళతారని హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టీ నోమ్ పేర్కొన్నారు. అధ్యక్షుడు ట్రంప్ తన పాలనలో వలస నియంత్రణకు ప్రాధాన్యతనిస్తానని ఎన్నోసార్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే న్యాయపరమైన పరిమితులు, సామర్థ్యలేమి కారణంగా తగిన స్థాయిలో బహిష్కరణలు జరగలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. తాజా పథకం వలస నియంత్రణలో ప్రధానంగా పనిచేస్తుందని ట్రంప్ ప్రభుత్వం విశ్వాసం వ్యక్తం చేస్తోంది.
Read Also : Injury : సుజనా చౌదరికి తీవ్ర గాయం