దేశవ్యాప్తంగా కొత్త GST శ్లాబులు (GST Slab) అమలులోకి వచ్చిన తర్వాత, వినియోగదారులకు తక్షణ ప్రయోజనం అందకపోవడం వివాదంగా మారింది. కొన్ని ప్రముఖ ఇ-కామర్స్ సైట్లు ఉత్పత్తుల ధరల్లో తగ్గింపులను ప్రతిబింబించకపోవడం వల్ల కేంద్రానికి అనేక ఫిర్యాదులు చేరుకున్నాయి. వినియోగదారులు తక్కువ GST చెల్లించినప్పటికీ, ఆ లాభం ధరల్లో కనిపించకపోవడం అసంతృప్తికి దారితీస్తోంది.

ఈ ఫిర్యాదులను కేంద్ర ప్రభుత్వం గమనించి ఆరా తీస్తోందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. అన్ని ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో ధరల మార్పులను పర్యవేక్షిస్తున్నామని, వెంటనే స్పష్టమైన నిర్ణయం తీసుకోలేమని కేంద్ర ప్రతినిధులు తెలిపారు. సెప్టెంబర్ 30 నాటికి పూర్తి నివేదిక సిద్ధమవుతుందని, ఆ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు చేపడతామని కేంద్రం స్పష్టం చేసింది. దీని ద్వారా వినియోగదారులకు న్యాయం జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
వినియోగదారుల కోసం ఫిర్యాదు మార్గాలు
వినియోగదారులు ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్నప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఫిర్యాదు చేయాలని కేంద్రం సూచించింది. ఇందుకోసం ప్రత్యేకంగా టోల్‌ఫ్రీ నంబర్ 1915 ను అందుబాటులో ఉంచగా, అలాగే www.consumerhelpline.gov.in వెబ్‌సైట్‌లో కూడా ఫిర్యాదు నమోదు చేసుకోవచ్చు. వినియోగదారుల సహకారంతో మాత్రమే ఈ సమస్యలను సత్వరమే పరిష్కరించగలమని అధికారులు స్పష్టం చేశారు.