యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన మాజీ డీఎస్పీ నళిని (Former DSP Nalini ) ఆరోగ్య సమస్యలు పై లేఖలో వ్యక్తం చేసిన ఆవేదనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. నళిని ప్రస్తుతం టైఫాయిడ్, డెంగ్యూ వంటి వైరల్ ఫీవర్స్‌తో బాధపడుతున్నారని తెలిసిన వెంటనే, సీఎం ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ హనుమంత్ రావు ఆమె ఇంటిని సందర్శించారు. నళిని ప్రస్తుతానికి ఆయుర్వేద మందులు వాడుతున్నారని, ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని కలెక్టర్ తెలిపారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నళిని ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలతో పాటు ఆమె కుటుంబ పరిస్థితులు, లేఖలో పేర్కొన్న అంశాలను తెలుసుకోవాలని ముఖ్యమంత్రి తనను ప్రత్యేకంగా ఆదేశించారని చెప్పారు. నళిని గారి ఆవేదనను ముఖ్యమంత్రి గంభీరంగా పరిగణిస్తున్నారని, ప్రభుత్వం ఎల్లప్పుడూ ఆమెకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆమెకు ఇంతవరకు వచ్చిన వైద్య ఖర్చులు, భవిష్యత్తులో వచ్చే ఖర్చులను కూడా ప్రభుత్వం భరిస్తుందని స్పష్టం చేశారు.
అలాగే, నళిని గారికి రావలసిన అన్ని బెనిఫిట్స్‌ను త్వరగా పరిశీలించి, అవసరమైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ముందడుగు వేస్తుందని కలెక్టర్ హనుమంత్ రావు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సేవ చేసిన అధికారులను మరచిపోకుండా, వారి సంక్షేమం కోసం కట్టుబడి ఉంటుందని ఆయన అన్నారు. ఈ పరిణామం, ప్రభుత్వ పట్ల మాజీ అధికారుల విశ్వాసాన్ని మరింత పెంచుతుందని, అదే సమయంలో సాధారణ ప్రజలకు కూడా భరోసా కలిగిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.