ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి (CM Chandrababu) పరిపాలన అద్భుతమని సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ గోపాలగౌడ్ (Venkate Gowda Gopala Gowda) ప్రశంసించారు. చంద్రబాబు దార్శనికత కలిగిన నాయకుడని, ఆయన నాయకత్వంలో రాష్ట్రం రాబోయే రోజుల్లో అభివృద్ధి పథంలో దూసుకెళ్లే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఆయన అన్నమయ్య జిల్లా చీకలబైలులో జరుగుతున్న గంగమ్మ జాతరలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
అమరావతి రైతులు చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయి
ఈ సందర్భంగా అమరావతి రాజధాని గురించి జస్టిస్ గోపాలగౌడ్ ప్రస్తావించారు. రాజధానిగా అమరావతికి తాను గతంలోనే మద్దతు తెలిపిన విషయాన్ని గుర్తు చేస్తూ, అమరావతి రైతులు చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఈ విషయంలో ముందడుగు వేసి, నిర్మాణ పనులను వేగవంతం చేయడం అభినందనీయమని అన్నారు. రైతులకు న్యాయం జరుగుతుండటం శుభపరిణామమని అభిప్రాయపడ్డారు.
వైసీపీ పై విమర్శలు
తదుపరి వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై కూడా ఆయన స్పందించారు. అక్రమాలకు పాల్పడ్డ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై సమగ్ర విచారణ జరిపి, తప్పు నిరూపితమైతే కఠిన శిక్షలు విధించాలన్నారు. అధికారం చేతిలో ఉందని అన్యాయాలు చేసే వారికి చట్టపరంగా తగిన శిక్షలు పడినప్పుడే ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుందన్నారు. ఇటువంటి చర్యలు భవిష్యత్తులో అధికారుల నిర్వాహనంలో నైతిక బాధ్యతను పెంచుతాయని జస్టిస్ గోపాలగౌడ్ స్పష్టం చేశారు.
Read Also : TPCC : వారం రోజుల్లో టీపీసీసీ కొత్త కార్యవర్గం ఏర్పాటు?