తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘రైతు భరోసా’ పథకాన్ని నిలిపివేస్తున్నారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ప్రభుత్వ అధికారిక విభాగం ‘తెలంగాణ ఫ్యాక్ట్ చెక్’ స్పందిస్తూ.. ఇవన్నీ పూర్తిగా అవాస్తవాలని, నిరాధారమైన వార్తలని తేల్చిచెప్పింది. రైతులను అయోమయానికి గురిచేయడానికి కొంతమంది కావాలని ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ప్రభుత్వం ఆరోపించింది. పథకం కొనసాగింపుపై రైతులకు ఎలాంటి సందేహాలు అవసరం లేదని, వ్యవసాయ పెట్టుబడి సాయం అందించే ప్రక్రియ నిరంతరాయంగా సాగుతుందని భరోసా ఇచ్చింది.
Madras HC: చిన్నారులకు సోషల్ మీడియా బ్యాన్‌పై కేంద్రానికి హైకోర్టు సూచన
ప్రస్తుతం క్షేత్రస్థాయిలో జరుగుతున్న ప్రక్రియ గురించి ప్రభుత్వం వివరణ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 65 లక్షల మందికి పైగా రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని, అయితే అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరగాలనే ఉద్దేశంతో ‘గ్రౌండ్ వెరిఫికేషన్’ నిర్వహిస్తున్నట్లు తెలిపింది. లబ్ధిదారుల జాబితాను క్రమబద్ధీకరించడం, నిజమైన రైతులకు నేరుగా సాయం అందేలా చూడటం కోసమే ఈ తనిఖీలు జరుగుతున్నాయి తప్ప, పథకాన్ని ఆపడానికి కాదని స్పష్టం చేసింది. అర్హత ఉన్న ఏ ఒక్క రైతుకూ అన్యాయం జరగదని, డేటా వెరిఫికేషన్ పూర్తయిన వెంటనే సాయం వారి ఖాతాల్లో జమ అవుతుందని ప్రభుత్వం పేర్కొంది.

ఈ పథకం అమలు విషయంలో ప్రభుత్వం ఎలాంటి కొత్త షరతులు విధించలేదని కూడా స్పష్టతనిచ్చింది. గతంలో ఉన్న నిబంధనల ప్రకారమే అర్హులైన రైతులందరికీ పెట్టుబడి సాయం అందుతుందని, ప్రజలు ఇతరులు చెప్పే పుకార్లను నమ్మి ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేసింది. అధికారిక సమాచారం కోసం ప్రభుత్వ వెబ్‌సైట్లు లేదా అధికారిక ప్రకటనలను మాత్రమే అనుసరించాలని సూచించింది. రైతుల సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని, వ్యవసాయ రంగాన్ని ఆదుకోవడానికి రైతు భరోసా వంటి పథకాలు నిరంతరం కొనసాగుతాయని ప్రభుత్వం ఈ సందర్భంగా పునరుద్ఘాటించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com