ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు ఊరటనిచ్చే కీలక నిర్ణయం తీసుకుంది సివిల్ సప్లై కార్పొరేషన్. ధాన్యం కొనుగోలు సమయంలో తేమశాతం కారణంగా పంట తిరస్కరణలు ఎదుర్కొంటున్న రైతుల ఆందోళనలపై స్పందిస్తూ, కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఢిల్లీ రావు ముఖ్యమైన ప్రకటన చేశారు. ఇకపై 17% వరకు తేమ ఉన్న ధాన్యాన్నీ కొనుగోలు చేస్తామని ఆయన తెలిపారు. సాధారణంగా 14% తేమ వరకు మాత్రమే ధాన్యం కొనుగోలు చేసే నిబంధన ఉన్నప్పటికీ, ఇటీవల వర్షాల ప్రభావంతో తేమశాతం ఎక్కువగా ఉండటంతో రైతులు ఇబ్బందులు పడుతున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ పరిస్థితుల్లో రైతుల పక్షాన నిలబడి ప్రభుత్వం ఈ సడలింపు ఇవ్వడం పంటదారులకు ఊరట కలిగిస్తోంది.
Latest News: Kashmir: పాక్ మద్దతుతో కొత్త కుట్రలు – కశ్మీర్‌లో తీవ్ర హెచ్చరిక!
ఈ సందర్భంగా వివిధ రైతు సంఘాల ప్రతినిధులు ఢిల్లీ రావును కలిసి వినతిపత్రం సమర్పించారు. మద్దతు ధరతో పాటు గోనె సంచులు, రవాణా ఖర్చులు కూడా ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు. పంటను అమ్మే సమయంలో మిల్లర్ల యాజమాన్యాలు, కొంతమంది దళారులు వేధింపులు చేస్తూ రైతుల పంటలను తక్కువ ధరకు కొనుగోలు చేయాలని ప్రయత్నిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై చర్యలు తీసుకుంటామని, మిల్లర్ల దుర్వినియోగాన్ని అరికట్టడానికి అధికారులు కఠినంగా వ్యవహరిస్తారని ఢిల్లీ రావు స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాలే తమ ప్రాధాన్యమని ఆయన హామీ ఇచ్చారు.

అలాగే పంట నష్టం, ధాన్యం కొనుగోలు, తేమశాతం అంచనా వంటి అంశాలపై ఎటువంటి సమస్యలు ఎదురైనా సమీప సివిల్ సప్లై లేదా వ్యవసాయ అధికారులను సంప్రదించాలని రైతులకు సూచించారు. రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. పంటల విక్రయ ప్రక్రియను పారదర్శకంగా, న్యాయంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఢిల్లీ రావు తెలిపారు. ఈ నిర్ణయం రైతుల మనోధైర్యాన్ని పెంచడమే కాకుండా, వర్షాల వల్ల నష్టపోయిన పంటలకు కనీస భరోసా లభించేలా చేస్తుందని రైతు సంఘాల నేతలు అభిప్రాయపడ్డారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/