కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath SIngh) చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. రాబోయే 15 నుంచి 20 సంవత్సరాల వరకు ప్రధాని పదవికి బీజేపీ లోపల ఎలాంటి పోటీ లేదని ఆయన స్పష్టం చేశారు. ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 2029 ఎన్నికలతో పాటు 2039 ఎన్నికల్లో కూడా బీజేపీ తరఫున ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీయేనని పేర్కొన్నారు. ఇది మోదీ నాయకత్వంపై పార్టీ ఉన్న నమ్మకాన్ని మాత్రమే కాకుండా, భవిష్యత్తులోనూ ఆయన ఆధిపత్యం కొనసాగుతుందన్న సంకేతాన్ని ఇస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ ప్రజలతో మమేకమవ్వగల శక్తి, క్లిష్టమైన సమస్యలను పరిష్కరించే తీరు, సంక్షోభ సమయంలో నిర్ణయాత్మకంగా వ్యవహరించే సామర్థ్యం మోదీ(Modi)కి ప్రత్యేకతని అన్నారు. దేశాన్ని ముందుకు నడిపించే దిశలో ఆయన చూపిస్తున్న దృఢ సంకల్పమే బీజేపీకి మరో 15-20 సంవత్సరాలు మోదీని ప్రధాన నాయకుడిగా నిలబెడుతుందని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా, పహల్గాం ఘటనకు మోదీ స్పందించిన తీరు ఆయన సంకల్ప బలానికి నిదర్శనమని రాజ్నాథ్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు బీజేపీ కేడర్‌లో ఉత్సాహం నింపుతున్నాయి.
అయితే, రాజ్నాథ్ వ్యాఖ్యలు ప్రతిపక్ష పార్టీలలో చర్చనీయాంశంగా మారాయి. ఒక వ్యక్తిని ఇంత దీర్ఘకాలం ప్రధాని అభ్యర్థిగా ముందుగానే ప్రకటించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని వారు విమర్శిస్తున్నారు. అయినప్పటికీ, బీజేపీ శ్రేణులు మాత్రం ఈ వ్యాఖ్యలను స్వాగతిస్తూ, మోదీ నాయకత్వం పార్టీకి భవిష్యత్‌లోనూ విజయం తెచ్చిపెడుతుందని నమ్ముతున్నాయి. అందువల్ల, రాజ్నాథ్ సింగ్ చేసిన ఈ ప్రకటన మోదీ రాజకీయ భవిష్యత్తును మరింత బలపరచే అంశంగా భావించవచ్చు.