తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2027లో జరిగే గోదావరి పుష్కరాలను (Godavari Pushkaralu 2027) మహా కుంభమేళా (Mahakumbh Mela) స్థాయిలో నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. పుష్కరాల సమయంలో భక్తుల రద్దీ, సౌకర్యాల అవసరం, భద్రత, వాహనాల నిర్వహణ తదితర అంశాలపై చర్చ జరుగనుంది. గత పుష్కరాల్లో వచ్చిన అనుభవాలతోపాటు, ఇతర రాష్ట్రాల మోడల్స్‌ను పరిశీలించి విశ్లేషనాత్మకంగా నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రయాగ్ రాజ్ కుంభమేళా అధ్యయనం ఆధారంగా ప్రణాళికలు
ఈ ఏడాది ప్రారంభంలో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో జరిగిన మహా కుంభమేళా ఏర్పాట్లను తెలంగాణ అధికారుల బృందం పరిశీలించింది. అక్కడి నిర్వహణ, భక్తుల ఏర్పాట్లపై అధ్యయనం చేసి నివేదిక రూపొందించింది. ఇప్పుడు ఆ నివేదిక ఆధారంగా గోదావరి పుష్కరాలకు సంబంధించిన ప్రణాళికలను రూపొందించనున్నారు. ఘాట్ల నిర్మాణం, శుభ్రత, తాత్కాలిక ఆసుపత్రులు, గదుల ఏర్పాట్లు, సమాచార కేంద్రాల ఏర్పాటు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు.
భక్తుల సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం
2015లో జరిగిన గోదావరి పుష్కరాల్లో సుమారు 4.5 కోట్ల మంది భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించగా, 2027లో ఈ సంఖ్య దాదాపు 10 కోట్లకు చేరే అవకాశం ఉన్నదని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల పెరుగుతున్న సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికాబద్ధంగా ముందస్తు ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించినట్లు సమాచారం. అంతర్జాతీయ ప్రమాణాలతో పుష్కరాలను నిర్వహించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
Read Also : Ration Door Delivery: ఏపీలో వారికి నేటి నుంచి ఇంటికే రేషన్