ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాబోయే రోజుల్లో రక్షణ, అంతరిక్ష రంగాల్లో (Space Sectors)ప్రాధాన్యత గల హబ్‌గా మారాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) స్పష్టంగా ప్రకటించారు. ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ 4.0 (2025–2030) పై రాష్ట్ర సచివాలయంలో సమీక్ష నిర్వహించిన సీఎం, ఈ రంగాల్లో అత్యాధునిక సాంకేతికతను ఆధారంగా చేసుకుని రూ.50 వేల కోట్ల నుంచి రూ.1 లక్ష కోట్ల వరకు పెట్టుబడులు ఆకర్షించాలన్న లక్ష్యాన్ని అధికారులకు సూచించారు. ఐదేళ్లలో ఏపీని డిఫెన్స్ టెక్నాలజీ కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా చొరవ తీసుకోవాలని స్పష్టం చేశారు.
ప్రత్యేక ఎంఎస్ఎంఈ ప్రోత్సాహం, రీసెర్చ్ హబ్‌లు
ఈ రంగంలో ఎంఎస్ఎంఈలకు ప్రత్యేక ప్రోత్సాహం అందించాలన్న ఉద్దేశంతో రూ.100 కోట్ల కార్పస్ ఫండ్ ఏర్పాటు, లాజిస్టిక్స్ సబ్సిడీలు, మార్కెటింగ్, బ్రాండింగ్ ప్రోత్సాహాలపై ముఖ్యమంత్రి దృష్టి పెట్టారు. “వన్ ఫ్యామిలీ – వన్ ఎంట్రప్రెన్యూర్” ఆశయాన్ని సాకారం చేయాలన్నారు. విశాఖపట్నం–శ్రీకాకుళం నావల్ క్లస్టర్, జగ్గయ్యపేట–దొనకొండ మిస్సైల్ తయారీ కేంద్రంగా అభివృద్ధి, కర్నూలు–ఓర్వకల్లులో డ్రోన్ల ఉత్పత్తి, లేపాక్షి–మడకశిరలో ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు ఏర్పాటు, తిరుపతిని ఆర్‌అండ్‌డి హబ్‌గా తీర్చిదిద్దే ప్రయత్నాలు చేపట్టాలన్నారు. డీఆర్డీఓ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ స్థాపనపై సూచనలు చేశారు.
ఏపీ వైపు ఇప్పటికే ప్రముఖ కంపెనీల దృష్టి
మడకశిర క్లస్టర్‌లో భారత్ ఫోర్జ్, ఎంఎండబ్ల్యూ సంస్థలు ఇప్పటికే పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నాయని, త్వరలోనే శంకుస్థాపన జరుగుతుందని సీఎం వెల్లడించారు. ప్రస్తుతం ఏపీలో రూ.22 వేల కోట్ల పెట్టుబడులతో 23 కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని, వీటివల్ల 17 వేల మందికి ఉపాధి లభించిందని వివరించారు. భారత్‌లో జాతీయ రక్షణ ఉత్పత్తుల వార్షిక విలువ రూ.1.27 లక్షల కోట్లు కాగా, ఇందులో 73 శాతం ప్రభుత్వ రంగ సంస్థలవేనని, కానీ ప్రైవేట్ భాగస్వామ్యాన్ని పెంచే దిశగా ఏపీ పాలసీ కీలకంగా మారబోతోందని ఆయన పేర్కొన్నారు.
Read Also : YCP Govt : గత వైసీపీ పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు – పవన్ కళ్యాణ్