గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో అమ్మాయిలు, మహిళల అదృశ్యంపై అప్పటి ప్రతిపక్ష నాయకుడిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తీవ్ర ఆరోపణలు చేసేవారు. ఏకంగా 30 వేల మంది అమ్మాయిలు రాష్ట్రంలో అదృశ్యమైతే అప్పటి ముఖ్యమంత్రి జగన్(Jagan)కు చీమకుట్టినట్లు కూడా లేదని విమర్శించేవారు. అమ్మాయిల అదృశ్యానికి జగన్ సర్కార్ నియమించిన వాలంటీర్లే కారణమని కూడా ఆరోపణలు గుప్పించారు. ఈ ఆరోపణలపై నమోదైన కేసును తాజాగా ప్రభుత్వం వెనక్కి తీసుకోవడంతో వాలంటీర్లు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో, అదృశ్యమైన బాలికలను గుర్తించి కుటుంబాలకు చేర్చాలనే లక్ష్యంతో ఏపీ పోలీసులు ‘ఆపరేషన్ ట్రేస్’ పేరుతో ప్రత్యేక డ్రైవ్‌ను ప్రారంభించారు.
ఆపరేషన్ ట్రేస్: లక్ష్యాలు, కార్యాచరణ
డీజీపీ హరీష్ గుప్తా ఈ ప్రత్యేక ఆపరేషన్‌ను ప్రారంభించి, దీనికి సంబంధించిన పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ‘ఆపరేషన్ ట్రేస్’ అనేది ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ ద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఆగస్టు 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు ప్రత్యేక డ్రైవ్ రూపంలో అమలు చేయబడుతుంది. బాలికల అపహరణలు, తప్పిపోవడాలను పూర్తిగా అదుపులోకి తేవడం దీని ప్రధాన లక్ష్యం. డీజీపీ ప్రకారం, ‘ట్రేస్’ అంటే Trace (గుర్తించడం), Reconnect (కలిపించడం), Assist (సహాయం అందించడం), Counsel (కౌన్సెలింగ్), Empower (సాధికారత కల్పించడం). ఇందులో భాగంగా, తప్పిపోయిన బాలికలను గుర్తించడం, సమస్యాత్మక ప్రదేశాలలో మహిళా పోలీసులతో నిఘా, కాపాడిన బాలికలను కుటుంబాలతో కలపడం, వారికి వైద్య సహాయం, ఆహారం, వసతి, దుస్తులు, న్యాయసలహాలు అందించడం వంటి చర్యలు చేపడతారు.
సమగ్ర ప్రణాళిక, ప్రజల భాగస్వామ్యం
ఈ ఆపరేషన్‌లో భాగంగా బాధితులకు వయస్సు నిర్ధారణ పరీక్షలు, గుర్తింపు పత్రాల రూపకల్పన, ఆకృత్యాలు జరిగితే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం వంటివి చేస్తారు. అలాగే, ఎన్జీవోల ద్వారా కౌన్సిలర్లను నియమించి బాధిత బాలికలకు మానసిక సమస్యలకు కౌన్సెలింగ్, చదువు, స్కిల్ ట్రైనింగ్, కెరీర్ గైడెన్స్, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తారు. ఆగస్టు 1, 2 తేదీల్లో డేటా కలెక్షన్ కోసం జిల్లా, సబ్-డివిజన్ స్థాయిలో టాస్క్ ఫోర్స్‌లు ఏర్పాటు చేస్తారు. 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఎన్జీవోలు, ప్రభుత్వ వసతి గృహాల తనిఖీలు, కేసుల పరిశీలన వంటివి నిర్వహిస్తారు. 11వ తేదీ నుంచి 30వ తేదీ వరకు రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలో, ప్రార్థనా స్థలాల్లో, రెడ్ లైట్ ఏరియాలలో ప్రత్యేక తనిఖీల ద్వారా తప్పిపోయిన బాలికలను గుర్తించడంతో పాటు, ప్రజల భాగస్వామ్యంతో ‘ఫైండ్ హర్’ (FIND HER) కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ‘శక్తి’ యాప్‌లో ‘రిపోర్ట్ మిస్సింగ్ చిల్డ్రన్’ ఫీచర్ ద్వారా, లేదా 112, 1098 (చైల్డ్ హెల్ప్‌లైన్), 181 (ఉమెన్ హెల్ప్‌లైన్) నంబర్లకు, శక్తి వాట్సాప్ నంబర్ 7993485111కు సమాచారం ఇవ్వడం ద్వారా ప్రజలు సహాయం పొందవచ్చు. ఈ కార్యక్రమాన్ని అన్ని జిల్లా యూనిట్లలో మొట్టమొదటి ప్రాధాన్యతగా చేపట్టాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
Read Also : Jagan Nellore Tour : జగన్ పర్యటన పై ప్రశాంతి రెడ్డి కామెంట్స్