వందల మంది పాలస్తీనా ఖైదీల విడుదలకు అంగీకారం
హమాస్: ఇజ్రాయెల్- హమాస్ ల మధ్య మరో కీలక ఒప్పందం కుదిరింది. తమ చెరలోని ఇజ్రాయెల్ దేశీయుల మృతదేహాలను అప్పగించేందుకు హమాస్.. వందల మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసేందుకు టెల్‌అవీవ్‌లు అంగీకరించాయని ఇరువర్గాల అధికారులు తెలిపారు. దీంతో కాల్పుల విరమణ ఒప్పందం మరికొన్ని రోజులు చెక్కుచెదరకుండా ఉందని వెల్లడించారు. తమ బందీలను విడుదల చేసేటప్పుడు హమాస్ వారితో క్రూరంగా ప్రవర్తించిందని ఇజ్రాయెల్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

రెండోదశ కాల్పుల విరమణ చర్చలు
ఈక్రమంలో ప్రతిగా విడుదల చేయాల్సిన 600 మందికి పైగా పాలస్తీనా ఖైదీల విడుదలను నిరవధికంగా ఆలస్యం చేస్తున్నట్లు ప్రకటించింది. దీన్ని హమాస్ కొట్టిపడేసింది. అంతేకాక.. రెండోదశ కాల్పుల విరమణ చర్చలపై మిలిటెంట్ సంస్థ ఆందోళన వ్యక్తంచేసింది. ఈ నేపథ్యంలో కాల్పుల విరమణను గాడిలో పెట్టేందుకు మధ్యవర్తులు (ఈజిప్టు, ఖతార్ దేశాలు) ప్రయత్నించారు. అందులోభాగంగా ప్రతినిధుల బృందంలోని అధికారులు మంగళవారం ఈజిప్టులో చర్చలు జరిపారు. ఈ చర్చల్లో మరో నలుగురు బందీల మృతదేహాల అప్పగింతకు సంస్థ అంగీకరించింది. పాలస్తీనా ఖైదీలను విడుదల చేసేందుకు టెల్‌అవీవ్ సైతం ఒప్పుకున్నట్లు హమాస్ ఓ ప్రకటనలో పేర్కొంది.
కాల్పుల విరమణలో కొంత నీలినీడలు
ఇటీవల ఇజ్రాయెల్-హమాస్‌ల మధ్య తొలిదశ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఇందులోభాగంగా తమ చెరలో ఉన్న 94 మందిలో 33 మంది బందీలకు హమాస్ స్వేచ్ఛ కల్పించాలి. ప్రతిగా దాదాపు 1700 మందికి పైగా పాలస్తీనీయులకు తమ జైళ్ల నుంచి ఇజ్రాయెల్ విముక్తి కల్పించాలి. ఈ తొలి దశ ఒప్పందానికి ఇంకొక్కవిడత బందీల మార్పిడి మాత్రమే మిగిలిఉండగా.. కాల్పుల విరమణలో కొంత నీలినీడలు అలుముకున్నాయి. తాజా చర్చల్లో అవి తొలగిపోయి.. మరోవిడత బందీల విడుదలకు ఒప్పందం కుదిరింది.