స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించేందుకు దోహదపడిన తన మొదటి దర్శకుడు కె. రాఘవేంద్రరావుపై తనకున్న గౌరవాన్ని మరోసారి చాటుకున్నారు. రాఘవేంద్రరావు జన్మదినం సందర్భంగా బన్నీ ఓ ప్రత్యేకమైన కానుక అందించారు. తన కార్యాలయ ప్రవేశ ద్వారంలో “నా తొలి దర్శకుడు” అనే క్యాప్షన్‌తో రాఘవేంద్రరావు ఫోటోను ఏర్పాటు చేయడం విశేషంగా మారింది. ఈ హృద్యమైన గౌరవం దర్శకేంద్రుడిని సర్‌ప్రైజ్ చేయడమే కాక, అభిమానులను కూడా ఆకట్టుకుంది.
రాఘవేంద్రరావుకు శుభాకాంక్షలు
జన్మదిన సందర్భంగా అల్లు అర్జున్ తన సోషల్ మీడియా వేదికగా రాఘవేంద్రరావుకి శుభాకాంక్షలు తెలుపుతూ, ఆయనతో దిగిన కొన్ని అరుదైన ఫొటోలను పంచుకున్నారు. “నా గురువుగారు రాఘవేంద్రరావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు! నన్ను సినిమాల్లోకి లాంచ్ చేసిన నా తొలి దర్శకుడు. ఎప్పటికీ కృతజ్ఞుడిని” అంటూ బన్నీ పేర్కొన్నారు. 2003లో వచ్చిన ‘గంగోత్రి’ సినిమా ద్వారా అల్లు అర్జున్ హీరోగా వెండితెరకు పరిచయం కావడం తెలిసిందే. బన్నీ గురువుపట్ల చూపిన ఈ ప్రేమ ప్రశంసల వెల్లువ తీసుకొచ్చింది.
అట్లీ దర్శకత్వంలో ఓ భారీ చిత్రం
ఇక వృత్తిపరంగా చూస్తే, అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఓ భారీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు ‘AA22EX6’ అనే వర్కింగ్ టైటిల్ ఉంది. ఇందులో బన్నీ ద్విపాత్రాభినయం చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. తన పాత్రకు న్యాయం చేయడానికి బన్నీ తీవ్రమైన వర్కౌట్లకు శ్రీకారం చుట్టారు. ఇటీవల ఫిట్‌నెస్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ షేర్ చేసిన బన్నీ జిమ్ ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు.
Read Also : Australia Floods : ఆస్ట్రేలియాలో వరద బీభత్సం… నలుగురి మృతి