దావోస్ పర్యటనలో వున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగపూర్ ప్రముఖులతో భేటీ అయ్యారు. ఈ పర్యటనలో కీలక ఒప్పందం జరిగింది. సింగపూర్ విదేశాంగ మంత్రి వివి యన్ బాలకృష్ణతో సీఎం రేవంత్ రెడ్డి బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా మౌలిక వసతుల అభివృద్ధి, ఇంధనం, గ్రీన్ ఎనర్జీ, పర్యాటక రంగం సహా పలు విభాగాల్లో భాగస్వామ్యంపై చర్చించారు. అనంతరం తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ సింగపూర్ ఐటీఈ తో భాగస్వామ్య ఒప్పందం చేసుకుంది.
ముఖ్యమంత్రి రేవంత్ సింగపూర్ పర్యటనలో భాగంగా కీలక ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఈ సారి తెలంగాణకు భారీ పెట్టుబడులే లక్ష్యంగా విదేశీ పర్యటన చేస్తున్నారు. రైజింగ్ తెలంగాణ అనే నినాదంతో సమావేశాలకు హాజరవుతున్నారు. యువతకు నైపుణ్య శిక్షణనిచ్చి ఉద్యోగ సంసిద్ధులుగా తీర్చిదిద్దేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ సింగపూర్ ప్రభుత్వ ఆధీనంలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ తో ఎంఓయు కుదుర్చుకుంది. సింగపూర్ ఐటిఇ పదో తరగతి చదివే విద్యార్ధుల స్థాయి నుంచి, చదువు పూర్తి చేసిన యువతకు నిపుణ్యం కలిగిన విద్యను అందించాలని నిర్ణయించారు.

తాజా ఎంఓయు వల్ల సింగపూర్ ఐటిఇ పాఠ్యాంశాలను (కరికులమ్) మనం ఉపయోగించుకునే వీలు కలుగుతుందని అధికారులు చెబుతున్నారు. సింగపూర్ లో మూడు రోజుల పర్యటన తరువాత రేవంత్ టీం దావోస్ చేరుకుంటుంది. రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టడమే టార్గెట్‌గా సీఎం రేవంత్ పర్యటన సమావేశాలు.. షెడ్యూల్ ఫిక్స్ అయింది. దావోస్ వేదికగా ప్రపంచ దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో సమావేశం అవుతారు. గత ఏడాది రేవంత్ దావోస్ కు వెళ్లారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అనుకూల వాతావరణం గురించి వివరించి.. పెట్టుబడి దారులను తెలంగాణ కు ఆహ్వానించనున్నారు.