ఉత్తరప్రదేశ్‌లోని సమాజ్‌వాదీ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు ఫిరోజ్ ఖాన్‌పై విద్యుత్ దొంగతనానికి సంబంధించి రూ. 54 లక్షల జరిమానా విధించినట్లు విద్యుత్ శాఖ అధికారులు ప్రకటించారు. అక్టోబర్ 20న సంభాల్‌లో ఫిరోజ్ ఖాన్‌పై కేసు నమోదైనట్లు విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నవీన్ గౌతమ్ తెలిపారు.
హయత్‌నగర్‌లోని పక్కా బాగ్‌లో జరిగిన తనిఖీలలో ఫిరోజ్ ఖాన్ ప్రైవేట్ కార్యాలయంలో విద్యుత్ దొంగతనం జరిగిందని గుర్తించిన తర్వాత, విద్యుత్ చట్టం-2003లోని సెక్షన్ 135 కింద ఆఫీసులో మీటర్ లేకపోవడం, అనుమతులతో కూడిన విద్యుత్ కనెక్షన్ లేదని పరిశీలనలో తేలింది.
తదుపరి, ఈ ఘటనకు సంబంధించి పోలీస్ స్టేషన్‌లో యాంటీ పవర్ థెఫ్ట్ వ్యవహారంలో ఫిరోజ్ ఖాన్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, ఆయనకు 15 రోజుల్లోగా తన వాదనను వినిపించాలంటూ నోటీసులు పంపించారు. దీనిపై స్పందించిన ఫిరోజ్ ఖాన్, తాను జనరేటర్ ఉపయోగిస్తున్నానని, దాన్నుంచే విద్యుత్తు వాడుతున్నారని చెప్పారు. ఆయన దీనిని రాజకీయ దురుద్దేశం కింద తనను ఇరికించేందుకు నడుస్తున్న కేసు అంటూ ఆరోపించారు.