విమాన ప్రమాదాలు అత్యంత విషాదకరమైనవి. అలాంటి ఘోర ప్రమాదాల నుంచి ప్రాణాలతో బయటపడటం అద్భుతమనే చెప్పాలి. అయితే, రెండు వేర్వేరు విమాన ప్రమాదాల్లో, వేర్వేరు కాలాల్లో ప్రాణాలతో బయటపడిన ఇద్దరు వ్యక్తుల విషయంలో ఓ విచిత్రమైన సారూప్యత వెలుగులోకి వచ్చింది. వారిద్దరూ ప్రయాణించిన సీటు నంబర్ ఒకటే కావడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ వింత కాకతాళీయంపై థాయ్‌లాండ్‌కు చెందిన ప్రముఖ గాయకుడు రుయాంగ్‌సాక్ (Ruyangsurak) జేమ్స్ లోయ్‌చుసాక్ (47) సోషల్ మీడియాలో పంచుకున్న విషయాలు వైరల్ అవుతున్నాయి.
రుయాంగ్‌సాక్ ప్రయాణించిన సీటు నంబర్ 11A
1998లో జరిగిన థాయ్ ఎయిర్‌వేస్ విమాన ప్రమాదంలో రుయాంగ్‌సాక్ (Ruyangsurak) ప్రాణాలతో బయటపడ్డారు. ఆ దుర్ఘటనలో 101 మంది మరణించగా, కేవలం 45 మంది మాత్రమే బతికారు. సూరత్ థానీలో ల్యాండ్ అవుతుండగా టీజీ261 విమానం చిత్తడి నేలలో కుప్పకూలింది. అప్పుడు తాను ప్రయాణించిన సీటు నంబర్ 11A అని రుయాంగ్‌సాక్ (Ruyangsurak) గుర్తుచేసుకున్నారు. ఇటీవల అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో ఒంటరిగా ప్రాణాలతో బయటపడిన విశ్వాస్‌కుమార్ రమేశ్ కూడా అదే 11ఎ నంబర్ సీటులో కూర్చున్నారని తెలిసి తాను దిగ్భ్రాంతికి గురయ్యానని ఆయన తెలిపారు. “భారత్‌లో జరిగిన విమాన ప్రమాదంలో ఒంటరిగా ప్రాణాలతో బయటపడిన వ్యక్తి నాలాగే 11ఎ సీటు నంబర్‌లో కూర్చున్నారు. ఇది చూసి నా ఒళ్లు గగుర్పొడిచింది” అని లోయ్‌చుసాక్ ఫేస్‌బుక్‌లో రాశారు.

రుయాంగ్‌సాక్ ఆవేదన
ఆనాటి ప్రమాదం తన జీవితంలో తీవ్రమైన మానసిక గాయాన్ని మిగిల్చిందని రుయాంగ్‌సాక్ (Ruyangsurak) ఆవేదన వ్యక్తం చేశారు. “దాదాపు పదేళ్లపాటు విమానం ఎక్కాలంటేనే భయపడేవాడిని. జనాలను కలవడం మానేశాను. ఆకాశంలో మేఘాలు కనిపిస్తే చాలు ఆందోళనకు గురయ్యేవాడిని” అని ఆయన నాటి భయానక రోజులను గుర్తుచేసుకున్నారు. “ఆ సమయంలో నేను ఎవరితోనూ మాట్లాడేవాడిని కాదు, ఎప్పుడూ కిటికీ వెలుపలే చూస్తూ ఉండేవాడిని. నా భద్రతా భావన కోసం కిటికీని ఎవరైనా మూయడానికి ప్రయత్నిస్తే అడ్డుకునేవాడిని. బయట దట్టమైన మేఘాలు లేదా వర్షపు తుపాను కనిపిస్తే, నేను నరకంలో ఉన్నట్టు భయంకరంగా అనిపించేది” అని ఆయన చెప్పినట్టు ‘ మెయిల్‌ఆన్‌లైన్’ ప్రచురించింది. “విమానం కూలిపోయిన చిత్తడి నేలల్లోని నీటి వాసన, శబ్దాలు, చివరికి రుచి కూడా నాకు ఇంకా గుర్తున్నాయి. చాలా కాలం పాటు ఆ భావనలను నాలోనే దాచుకున్నాను” అని కూడా ఆయన తెలిపారు.
బోర్డింగ్ పాస్ లేకపోయినా
తన వద్ద పాత బోర్డింగ్ పాస్ లేనప్పటికీ, అప్పటి వార్తాపత్రికల కథనాలు తన సీటు నంబర్‌ను ధ్రువీకరించాయని రుయాంగ్‌సాక్ (Ruyangsurak) చెప్పారు. ఇటీవలి ప్రమాదంలో ఆప్తులను కోల్పోయిన వారందరికీ ఆయన ప్రగాఢ సంతాపం తెలిపారు. ప్రాణాలతో బయటపడటం తనకు “రెండో జీవితాన్ని” ఇచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు.
స్నేహితులు & నెటిజన్ల భావోద్వేగ స్పందనలు
రుయాంగ్‌సాక్ (Ruyangsurak) ఫేస్‌బుక్ పోస్ట్‌పై ఆయన స్నేహితులు, నెటిజన్లు పలు రకాలుగా స్పందించారు. ఓ స్నేహితుడు, “నేను నిన్ను ఆసుపత్రిలో చూడటానికి వెళ్లిన రోజు నాకు స్పష్టంగా గుర్తుంది. గాజు గది ముందు నిలబడి నిన్ను చూశాను, నీ శరీరం అంతా ట్యూబ్‌లతో ఉంది, నువ్వు నిద్రలో ఉన్నట్టు లేదా స్పృహలో లేనట్టు కనిపించావు. నిన్ను చూసిన తర్వాత నేను వెంటనే సూరత్ థానీకి నా తదుపరి విమానం పట్టుకోవడానికి పరుగెత్తాల్సి వచ్చింది. ఆ క్షణంలో నేను నిజంగా భయపడ్డాను” అని రాశారు. మరో యూజర్ “ఇది నమ్మశక్యంగా లేదు” అని వ్యాఖ్యానించగా, ఇంకొకరు “దీని వెనుక కచ్చితంగా ఏదో దాగి ఉండాలి” అని అభిప్రాయపడ్డారు. ఈ విచిత్ర సారూప్యత ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
“రెండో జీవితం” – రుయాంగ్‌సాక్ భావోద్వేగ వ్యాఖ్య
అహ్మదాబాద్ ప్రమాదంలో బంధువులను కోల్పోయిన వారందరికీ సానుభూతి తెలియజేస్తూ,
“ప్రాణాలతో బయటపడటం నాకు రెండో జీవితాన్ని ఇచ్చింది” అంటూ రుయాంగ్‌సాక్ (Ruyangsurak) భావోద్వేగంతో రాసుకున్నారు. ఈ రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఒకే 11A సీటు నంబర్‌లో కూర్చున్న వారు ప్రాణాలతో బయటపడటం, ఒక చిన్న వింత కాకతాళీయమే కాదు – ఇది ప్రపంచవ్యాప్తంగా చర్చకు కేంద్ర బిందువుగా మారుతోంది.
Read Also: Himanta Biswa Sarma: అసోంలో ఉద్రిక్తతలు: ధుబ్రిలో ‘కాళ్చివేత