Borugadda Anil : వివరణ ఇవ్వాలంటూ బోరుగడ్డకు హైకోర్టు ఆదేశం టీడీపీ నేతలను దూషించిన కేసులో నిందితుడిగా ఉన్న రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌కు సంబంధించిన వివాదం మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు నిర్దేశించిన గడువులోగా జైలు అధికారుల ముందు హాజరుకావాలని సూచించినప్పటికీ, బోరుగడ్డ అనిల్ నిర్దేశిత సమయానికి హాజరుకాకపోవడంతో పోలీసులు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు జైలు అధికారుల ముందు ఎందుకు హాజరుకాలేదో స్పష్టమైన వివరణ ఇవ్వాలని బోరుగడ్డను ఆదేశించింది.అయితే తన తల్లి అనారోగ్యంగా ఉందంటూ బోరుగడ్డ అనిల్ కోర్టుకు సమర్పించిన పత్రాలపై సందేహాలు వ్యక్తమయ్యాయి. కోర్టులో సమర్పించిన ఆరోగ్య పత్రాలు నిజమైనవేనా లేదా తప్పుడు సమాచారం సమర్పించారా? అనే అంశంపై హైకోర్టు విచారణ జరిపింది.

ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కూడిన నివేదికను సీల్డ్ కవర్‌లో కోర్టు ముందు ఉంచాలని పోలీసులను ఆదేశించింది.కేసు విచారణలో మున్ముందు ఇంకా ఏమైనా వివరణలు అవసరమైతే, విచారణను మరింత లోతుగా చేపట్టే అవకాశం ఉందని న్యాయవర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణను హైకోర్టు మరో వారం రోజులకు వాయిదా వేసింది. ఈ వ్యవహారంపై టీడీపీ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. బోరుగడ్డ అనిల్ నిజంగానే ఆరోగ్య కారణాలతో హాజరు కాలేదా? లేదా కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారా? అనే అంశంపై హైకోర్టు స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ కేసు మరిన్ని కీలక మలుపులు తిరిగే అవకాశముంది.