చనిపోయిన తమ ఆప్తులను భూమిపైన కాదు, అంతరిక్షంలో శాశ్వతంగా నిలిపెయ్యాలని కలలు కన్న వారు మళ్లీ భూమికి పరిమితమయ్యారు. భూమిపై యాదృచ్ఛికంగా జరిపే అంత్యక్రియలకు భిన్నంగా, ఆకాశంలో తుది వీడ్కోలు పలకాలని భావించిన ప్రయత్నం విషాదంగా ముగిసింది.జూన్ 23న ‘నిక్స్’ అనే ప్రత్యేక క్యాప్సూల్ (space capsule crash) ను నింగిలోకి పంపించారు. ఇందులో 166 మంది మరణించిన వారి అస్థికలు మాత్రమే కాకుండా, పరిశోధన కోసం కొన్ని గంజాయి విత్తనాలు, పరికరాలు కూడా ఉన్నాయి. ఈ వినూత్న ప్రయోగాన్ని జర్మనీకి చెందిన ‘ది ఎక్స్‌ప్లోరేషన్ కంపెనీ’ (The Exploration Company) అమెరికాలోని ‘సెలెస్టిస్’ అనే స్పేస్ బరియల్ సంస్థతో కలిసి నిర్వహించింది.

ప్రయోగం మొదట్లో విజయవంతమే
ప్రారంభంలో ప్రయోగం ఆశాజనకంగా సాగింది. నిక్స్ క్యాప్సూల్ రెండు కక్ష్యల చుట్టూ తిరిగింది. భూ వాతావరణంలోకి తిరిగి ప్రవేశించింది. భూమితో సంభాషణ కూడా పునరుద్ధరించుకుంది. అయితే సముద్రంలో దిగడానికి కొన్ని నిమిషాల ముందు సంబంధం పూర్తిగా కోల్పోయింది.
పసిఫిక్ సముద్రంలో ముగిసిన ప్రయాణం
తర్వాత వ్యోమనౌక పసిఫిక్ మహాసముద్రంలో కూలిపోయినట్లు అధికారికంగా ధృవీకరించారు. క్యాప్సూల్ ఉన్నచోట ఖచ్చితంగా గుర్తించలేని పరిస్థితి ఏర్పడింది. ఇది చూసి ఆశపడిన కుటుంబాలకు మానసికంగా గట్టి దెబ్బ తగిలింది.
ఇది పాక్షిక విజయం అంటున్న సంస్థ
‘ది ఎక్స్‌ప్లోరేషన్ కంపెనీ’ దీన్ని పాక్షిక విజయం అని అభివర్ణించింది. “లాంచింగ్, కక్ష్యలో ప్రయాణం, భూమికి తిరిగివచ్చే దశలన్నీ విజయవంతం అయ్యాయి. చివరి క్షణంలో తలెత్తిన సాంకేతిక లోపమే ఓటమికి కారణం” అని కంపెనీ లింక్డిన్ పోస్ట్‌లో పేర్కొంది.
అస్థికలు ఇక సముద్ర గర్భంలోనే
సెలెస్టిస్ సంస్థ దీనిపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది. “క్యాప్సూల్‌ను తిరిగి పొందడం అసాధ్యం. వారి ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం” అని సెలెస్టిస్ సీఈఓ చాఫర్ అన్నారు. వారి అభిమానం అంతరిక్షం గమ్యం అయినా… చివరికి ఆ ఆశల ప్రయాణం సముద్రగర్భంలో ముగిసింది.
Read Also : Novak Djokovic: నొవాక్ జకోవిచ్ అరుదైన ఘనత