Telangana: హెచ్సీయూ భూములను పరిశీలించేందుకు బీజేపీ నేతలు బయల్దేరారు. భూముల వద్ద వాస్తవ పరిస్థితులను తెలుసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యేలు వెళ్లేందుకు యత్నించారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ ముందు భారీగా పోలీసులు మోహరించారు. దీంతో బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. బీజేపీఎల్పీ నేత మహేశ్వర్రెడ్డి హౌజ్ అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద బీజేపీ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, దన్ పాల్ సూర్యనారాయణ గుప్త, బీజేపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. విద్యార్థులు నిరసనకు పిలుపునివ్వడంతో అడ్డుకునేందుకు భారీ గేట్ల ఏర్పాటు చేశారు. పరిసర ప్రాంతాల్లో ఎవరినీ ఉండనివ్వ కుండా పంపివేస్తున్నారు. కొద్ది సేపట్లో బీజేవైఎం, ఏబీవీపీ కార్యకర్తలు వచ్చే అవకాశం ఉంది.

400 ఎకరాల భూమికి సంబంధించి హైకోర్టులో కేసు
ఈ అంశంపై తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మించి కాంగ్రెస్ దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. ప్రభుత్వం వేలం వేయాలనుకున్న 400 ఎకరాల భూమి అటవీశాఖ పరిధిలోనిది. అటవీ శాఖకు చెందిన ఏ భూమినైనా కేంద్ర ప్రభుత్వ ఆమోదం లేకుండా నరికి వేయకూడదని సుప్రీంకోర్టు తీర్పులున్నాయి. 400 ఎకరాల భూమికి సంబంధించి హైకోర్టులో కేసు నడుస్తుంది. ఇదంతా తెలిసి కూడా సర్కార్ భూముల చదును పేరుతో కోర్ట్ ధిక్కరణకు పాల్పడుతోంది. చెట్లను తొలగిస్తూ మొక్కలను పీకేస్తూ పర్యావరణ విధ్వంసానికి దిగుతుంది. కాంగ్రెస్ అవకాశవాద రాజకీయాలకు పరాకాష్ట. అని కేంద్రమంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు.