తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) అంశంపై తీవ్రంగా స్పందించారు. దక్షిణాదిలో బీజేపీకి తగిన ప్రాతినిధ్యం లేదని, ఇటీవలి ఎన్నికల్లో ఈ ప్రాంతంలో కేవలం 29 ఎంపీ స్థానాలు మాత్రమే గెలుచుకున్నట్లు గుర్తు చేశారు. దక్షిణ భారతదేశంలోని ఏ రాష్ట్రంలోనూ బీజేపీ పూర్తి స్థాయిలో అధికారంలో లేదని, ఆంధ్రప్రదేశ్‌లో కేవలం జూనియర్ భాగస్వామిగానే ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తూ, డీలిమిటేషన్‌ను రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగిస్తోందని ఆరోపించారు.
డీలిమిటేషన్ అమలు ఆ రాష్ట్రాలకే లాభం
డీలిమిటేషన్ అమలు అయితే దక్షిణాది రాష్ట్రాలకు కాకుండా ఉత్తరాది రాష్ట్రాలకు లాభం కలుగుతుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గతంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణ చర్యలను సమర్థంగా అమలు చేశాయని గుర్తుచేశారు. అయితే, ఇప్పుడు అదే కేంద్రం ఈ అంశాన్ని ఉద్దేశపూర్వకంగా వాడుకుంటూ, డీలిమిటేషన్ ద్వారా ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ పార్లమెంట్ స్థానాలు కేటాయించే విధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.

డీలిమిటేషన్‌ను మరికొన్ని దశాబ్దాలు వాయిదా వేయాలి
డీలిమిటేషన్‌ను మరికొన్ని దశాబ్దాలు వాయిదా వేయాలని సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారు. మరో 30 సంవత్సరాలు దక్షిణాదిలో జనాభా పెరుగుదల ఎలా ఉంటుందో చూడాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని, ఏకపక్షంగా డీలిమిటేషన్‌ను అమలు చేయడం దక్షిణాదికి అన్యాయం చేయడమే అవుతుందని వ్యాఖ్యానించారు. జనాభా పెరుగుదల ఆధారంగా మాత్రమే ఎన్నికల నియోజకవర్గాలను పెంచడం సరైన విధానం కాదని ఆయన స్పష్టం చేశారు.
దక్షిణాది రాష్ట్రాలు తగిన విధంగా దీనిపై స్పందించాలి
జాతీయ స్థాయిలో జరిగిన ఇండియా టుడే సదస్సులో రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, దక్షిణాది రాష్ట్రాలు తగిన విధంగా స్పందించాలని సూచించారు. జనాభా నియంత్రణలో ముందున్న దక్షిణాది రాష్ట్రాలను కించపరిచే విధంగా డీలిమిటేషన్ చట్టాలను రూపొందించడం అన్యాయమని, ఈ అంశంపై దక్షిణాది రాష్ట్రాలు ఏకమై పోరాడాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.