Bill gates : మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఏపీ ప్రభుత్వంతో ఒప్పందాలపై హర్షం వ్యక్తం చేశారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా పోస్టు చేశారు. రాష్ట్రంలో ఆరోగ్యం, వ్యవసాయం, విద్యా రంగాల్లో కొత్త ఆవిష్కరణలకు కృషి చేస్తామన్నారు. భవిష్యత్తులో మరిన్ని మెరుగైన సేవలు అందించాలని ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. బుధవారం ఢిల్లీలో బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించి గేట్స్ ఫౌండేషన్‌తో పలు ఒప్పందాలు చేసుకున్నారు.

ఏఐ, శాటిలైట్ ఆధారిత వ్యవస్థలు
అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఈ ఐదు రంగాల్లోని సమస్యలకు పరిష్కారాలు కనుక్కొని, వాటిని వినియోగంలోకి తెస్తారు. ఈ ఒప్పందం ద్వారా గేట్స్ ఫౌండేషన్.. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలను అమలుచేసే భాగస్వామ్య సంస్థలకు అవసరమైన సహకారం అందిస్తుంది. కృత్రిమ మేధను ఉపయోగించి రాష్ట్ర ప్రజల ఆరోగ్య సమస్యలను ముందుగానే విశ్లేషించి, అందుకు తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తుంది. ఏఐ, శాటిలైట్ ఆధారిత వ్యవస్థల ద్వారా పంటల సాగులో అనుసరించాల్సిన విధానాలు, వనరుల నిర్వహణలో పాటించాల్సిన జాగ్రత్తలపై ముందస్తుగా సలహాలు, సూచనలు అందిస్తుంది.
వైద్యం, విద్య, వ్యవసాయం, ఉద్యోగాల కల్పన
రాష్ట్ర పురోగతికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడానికి ముందుకొచ్చిన గేట్స్ ఫౌండేషన్‌కు సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. బిల్ గేట్స్‌తో అద్భుతమైన సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం, గేట్స్ ఫౌండేషన్ సమన్వయంతో ఎలా కలిసి పనిచేయాలన్న అంశంపై ఫలవంతమైన చర్చలు జరిగాయి. వైద్యం, విద్య, వ్యవసాయం, ఉద్యోగాల కల్పన వంటి విషయాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి కృత్రిమ మేధ, ప్రెడిక్టివ్ అనలిటిక్స్ వినియోగంపై చర్చించాం. స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాన్ని సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా కట్టుబడి ఉంది.