రాయలసీమ అభివృద్ధి (Rayalaseema Development) దిశగా మరో పెద్ద అడుగు పడింది. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి. భరత్ (TG Bharat)మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో విజయవాడ – కర్నూలు విమాన సర్వీసుల షెడ్యూల్ పోస్టర్‌ను విడుదల చేశారు. జూలై 2వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ విమాన సర్వీసు వారానికి మూడు రోజులు – సోమవారం, బుధవారం, శుక్రవారం – నడవనుందని ఇండిగో సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. విమానం మధ్యాహ్నం 3:45 గంటలకు విజయవాడ నుండి బయలుదేరి సాయంత్రం 4:50కి ఓర్వకల్లో చేరుతుంది. తిరిగి ఓర్వకల్లులో 5:10కి బయలుదేరి 6:15కి విజయవాడకు చేరుకుంటుంది. ఈ విమాన టికెట్ ధర రూ.2533 నుండి ప్రారంభమవుతుందని తెలిపారు.
డిఫెన్స్, డ్రోన్లు, ఎలక్ట్రిక్ మరియు గ్రీన్ ఎనర్జీ రంగాల్లో పరిశ్రమలు ఏర్పాటు
ఈ సందర్భంగా మంత్రి టి.జి. భరత్ మాట్లాడుతూ, రాయలసీమలోని లేపాక్షి నుండి కొప్పర్తి, ఓర్వకల్లు వరకు ఇండస్ట్రియల్ కారిడార్ (Industrial Corridor) వేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఈ ప్రాంతంలో డిఫెన్స్, డ్రోన్లు, ఎలక్ట్రిక్ మరియు గ్రీన్ ఎనర్జీ రంగాల్లో పరిశ్రమలు ఏర్పాటయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని, త్వరలో ఓర్వకల్లో సెమీకండక్టర్ పరిశ్రమ స్థాపన కూడా జరుగుతుందని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం 2.0 పారిశ్రామిక విధానాన్ని విడుదల చేసిన వెంటనే ఆ పనులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.
కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు
విమాన సేవలు ప్రారంభం కావడం వల్ల పారిశ్రామికవేత్తలు, ముఖ్యాధికారుల రాకపోకలకు ఇది ఎంతో ప్రయోజనం కలిగిస్తుందని మంత్రి భరత్ అభిప్రాయపడ్డారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు సంబంధించి ప్రక్రియ కొనసాగుతోందని, త్వరలోనే బెంచ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో విమాన సర్వీసును ప్రతి రోజు అందుబాటులోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇండిగో విజయవాడ సేల్స్ మేనేజర్ మోహిత్ కృష్ణ, కర్నూలు సేల్స్ మేనేజర్ రవిబాబు, విమానాశ్రయ అసిస్టెంట్ మేనేజర్ సుభాని, సుజన్ పాల్గొన్నారు.
Read Also : Uttam Kumar Reddy : సముద్రంలో కలిసే నీటిని వాడుకుంటామనడంపై ఉత్తమ్ ఆగ్రహం