Betting apps: తెలంగాణ ప్రభుత్వం బెట్టింగ్ యాప్స్ వ్యవహారం పై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. ఈ మేరకు డీజీపీ జితేందర్ ఆదేశాలు జారీ చేశారు. సీఐడీ అదనపు డీజీ పర్యవేక్షణలో సిట్ దర్యాప్తు చేపట్టనుంది. సిట్ బృందంలో ఐజీ రమేశ్‌తో పాటు ఎస్పీలు సింధు శర్మ, వెంకటలక్ష్మి, అదనపు ఎస్పీ చంద్రకాంత్, డీఎస్పీ శంకర్ ఉన్నారు. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై ఇప్పటికే పంజాగుట్టతో పాటు సైబరాబాద్, మియాపూర్ పీఎస్‌లలో కేసులు నమోదయ్యాయి.

ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సైతం కీలకపాత్ర
ఈ కేసులను కూడా ప్రభుత్వం సిట్‌కు బదిలీ చేసింది. దీనిపై 90 రోజుల్లో పూర్తిస్థాయి నివేదిక అందజేయాలని సిట్‌కు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. కాగా, ప్రత్యేక దర్యాప్తు బృందంలో (సిట్) సీనియర్ ఐపీఎస్ అధికారి, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సైతం కీలకపాత్ర పోషించనున్నారని తెలుస్తోంది. సిట్ ఏర్పాటుపై బుధవారం అసెంబ్లీలో ప్రకటన చేయడానికి ముందు సీఎం రేవంత్‌రెడ్డి ఓ కీలక సమావేశం నిర్వహించారు.
మల్టీ లెవల్ మార్కెటింగ్‌పై పోరు
శాసనసభ ప్రాంగణంలోని ఆయన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి డీజీపీ జితేందర్, ఇంటెలిజెన్స్ డీజీ శివధర్‌రెడ్డి, నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్‌లతోపాటు సజ్జనార్ సైతం పాల్గొన్నారు. సజ్జనార్ సీఐడీ ఎస్పీగా ఉన్నప్పుడు మల్టీ లెవల్ మార్కెటింగ్‌పై పోరు ప్రకటించారు. వివిధ సంస్థల కార్యకలాపాలను బహిర్గతం చేయడంతో పాటు ప్రత్యేక చట్టం రావడానికీ కారణమయ్యారు.