Kishan Reddy : కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్‌తో కలిసి బేగంపేట రైల్వేస్టేషన్‌ను సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడారు. రైల్వేలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయన్నారు. త్వరలోనే బేగంపేట రైల్వే స్టేషన్‌ను ప్రారంభిస్తామని చెప్పారు. మరో పది శాతం పనులు పూర్తికావాల్సి ఉందని వివరించారు. విమానాశ్రయాల తరహాలో రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా కేంద్రప్రభుత్వం వివిధ రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తోందని అన్నారు.

దశలవారీగా అభివృద్ధి పనులను పూర్తి
బేగంపేట రైల్వేస్టేషన్‌లో అందరూ మహిళలే ఉద్యోగులు ఉండేలా చూస్తాం. రూ.26.55 కోట్లతో మొదటివిడత పనులు జరుగుతున్నాయి. మరో రూ.12 కోట్లతో రెండోవిడత పనులు పూర్తి చేస్తాం. ప్రయాణికులకు ఇబ్బందిలేకుండా దశలవారీగా అభివృద్ధి పనులను పూర్తి చేస్తున్నాం. ఒకప్పుడు రైల్వేస్టేషన్‌కు వస్తే ముక్కు మూసుకొని రావాల్సిన పరిస్థితి ఉండేది. ప్రధాని మోడీ స్వచ్ఛభారత్ ద్వారా స్వచ్ఛ రైల్వేస్టేషన్ పేరుతో వినూత్న మార్పులను తీసుకొచ్చారు. చర్లపల్లి రైల్వే స్టేషన్‌ని కూడా అధునాతనంగా నిర్మించుకొని ప్రారంభించుకున్నాం అన్నారు.
వాళ్లకా లాభాలు ఎలా వస్తున్నాయి?
త్రిభాషా విధానం దేశంలో కొత్తదేమీ కాదు. కేంద్ర ప్రభుత్వం బలవంతంగా తమపై హిందీ రుద్దుతోందని దుష్ప్రచారం చేస్తున్నారు. ఏ ఒక్కరిపై కూడా బలవంతంగా హిందీని రుద్దే ప్రయత్నం చేయలేదు. ఏ భాష కావాలంటే అందులో చదువుకునే అవకాశం ఉంది. తమిళ భాషలో తీసిన సినిమాలు హిందీలో డబ్ చేసి రూ.కోట్లు లాభాలను నిర్మాతలు పొందుతున్నారు. వాళ్లకా లాభాలు ఎలా వస్తున్నాయి? భాష పేరుతో దేశాన్ని విభజించాలని చూడటం సరికాదు అన్నారు.