కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా బైక్, ట్యాక్సీ (Bike-Taxi) సేవలను నిలిపివేస్తూ హైకోర్టు (Hi court) కీలక ఆదేశాలు జారీ చేయడంతో నిన్నటి నుంచి ఈ సేవలు బ్యాన్ అయ్యాయి. అయితే నిషేధం తర్వాత ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారు. బైక్ ట్యాక్సీల నిషేధం తరువాత ఆటోవాలాలు ప్రయాణికుల నడ్డి విరిచారు. ఇష్టం వచ్చినట్లుగా రేట్లు చెప్పడంతో ప్రయాణికులు బావురుమంటున్నారు. ఇతర ఆప్సన్స్ లేకపోవడంతో అడిగినంత ఇచ్చి ఆటోలలో ప్రయాణించడం తప్ప వేరే మార్గం లేదని ప్రయాణికులు వాపోతున్నారు.
ప్రయాణికులకు ఇబ్బందులు
చాలా మంది బైక్ టాక్సీలు మాత్రమే సరసమైన, నమ్మదగిన ఎంపికగా గుర్తిస్తుంటారు. నేను చాలాసార్లు ఆటో బుక్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాను.అయితే గమ్యస్థానం విన్న తర్వాత డ్రైవర్ దానిని రద్దు చేస్తాడు. చిక్కలసంద్ర బస్ స్టాప్ నుండి జయనగర్ BDA కాంప్లెక్స్ వరకు 3.9 కి.మీ ప్రయాణానికి బైక్ టాక్సీలు రూ. 50 వసూలు చేసేవి. ఇప్పుడు ఆటోలు రూ. 120 వసూలు చేస్తున్నాయి. అలాగే ధరలు నిర్ణయించే డ్రైవర్ల దయపై నేను ఎందుకు ఉండాలని చిక్కలసంద్ర నివాసి అనిత మురళి ప్రశ్నించారు.

రవాణా చట్టం ప్రకారం
ఇది ఇతని ఒక్కడి బాధే కాదు. బెంగళూర్ (Bengaloor)వ్యాప్తంగా చాలా మంది ఇదే రకమైన ఇబ్బందితో బాధపడుతున్నారు. బెంగళూరులో 2,500 కంటే ఎక్కువగానే ఆటో స్టాండులు ఉన్నాయి. వారంతా బుకింగ్ అడిగితే ఎక్కువ డబ్బును డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నియంత్రిత బైక్ టాక్సీలను ఎందుకు నిషేధిస్తోందని కోరమంగళకు చెందిన డేటా విశ్లేషకుడు కిషోర్ ఆర్ అడిగారు. సమస్య ప్లాట్‌ఫామ్ కాదని..నమ్మదగిన అంశాలు లేకపోవడమేనని చెబుతున్నారు. సిద్దరామయ్య ప్రభుత్వం ఆటోలను సరిచేయలేకపోతే కనీసం ఈ బైక్ ట్యాక్సీలను అయినా న్యాయంగా నడపనివ్వండి” అని రవాణా విధాన పరిశోధకుడు వినాయక్ దేశ్‌పాండే వాపోతున్నారు.
ప్రజల ప్రశ్నలు – ప్రభుత్వ స్పందన ఎప్పుడు?
ఇక హైకోర్టు ఆదేశాన్ని పరిగణనలోకి తీసుకోకుండా సోమవారం టాక్సీ సేవలు అందిస్తున్న బైకర్లపై చర్యలు తీసుకున్న రవాణా శాఖ మొత్తం 103 బైక్‌లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసింది.నగరంలోని వివిధ ప్రాంతాల్లో తనిఖీల సందర్భంగా రవాణా శాఖ అధికారులు బైక్ టాక్సీ సేవలను అందిస్తున్న 103 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 103 బైక్‌లపై కేసు నమోదు చేసి, ఒక్కొక్కరికి రూ.5,000 జరిమానా విధించారు.
“ప్రత్యామ్నాయాలు లేకుండా ఎందుకు నిషేధం?”
ఓలా, ఉబర్, రాపిడో సహా అన్ని అగ్రిగేటర్లు బైక్ టాక్సీ సేవను నిలిపివేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. బైక్ టాక్సీ సర్వీస్ ఎంపికను కూడా యాప్‌ల నుండి తొలగించారు. అయితే, ఓలా, ఉబర్, రాపిడో తాజాగా బైక్ పార్శిల్ సేవను ప్రారంభించాయి. టాక్సీ సేవకు బదులుగా, వినియోగదారులకు వస్తువులను డెలివరీ చేసే సేవను అందిస్తున్నారు. అయితే, ఈ సేవ పేరుతో బైకర్లు టాక్సీ సేవను కూడా అందిస్తున్నట్లు రవాణా శాఖ తెలుసుకుంది. దీంతో వీరిపై రవాణా శాఖ చర్యలు తీసుకుంది. వైట్ బోర్డ్ వాహనాలు టాక్సీ సేవలను అందించలేవు: రాష్ట్ర రవాణా నిబంధనల ప్రకారం, బైక్ టాక్సీలు, వైట్ బోర్డ్ వాహనాలు టాక్సీ సేవలను అందించలేవు. బైక్ టాక్సీ సేవలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎటువంటి నియమాలను రూపొందించలేదు. అయితే, ఓలా, ఉబర్, రాపిడో వంటి ఇతర కంపెనీలు బైక్ టాక్సీ సేవలను అందిస్తున్నాయి.
లక్షల గిగ్ కార్మికులపై ప్రభావం
ఈ విషయంలో హైకోర్టులో నిన్న పిటిషన్ విచారణకు వచ్చింది.ఈ పిటిషన్ విచారించిన ధర్మాసనం జూన్ 15 తర్వాత రాష్ట్రంలో బైక్ టాక్సీ సేవలను నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. 1 లక్ష ఉద్యోగాలు ప్రమాదంలో: బెంగళూరు నగరంతో పాటుగా కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా లక్ష మందికి పైగా గిగ్ కార్మికులు బైక్ టాక్సీలు నడుపుతూ జీవనం సాగిస్తున్నారని.. వారు కుటుంబ పోషణ కోసం రోజుకు 10 నుండి 12 గంటలు పనిచేస్తున్నారని అసోసియేషన్ తమ లేఖలో తెలిపింది. ఇప్పుడు బ్యాన్ చేస్తే జీవనాధారం లేక వీరంతా రోడ్డు మీదకు వస్తారని లేఖలో పేర్కొంది. ఇది సైడ్ ఆదాయం కాదని ప్రధాన వనరుగా వీరంతా బతుకుతున్నారని నిర్ణయాన్ని దయచేసి వెనక్కి తీసుకోవాలని లేఖలో నమ్మ బైక్ టాక్సీ అసోసియేషన్ కోరింది.
బదులుగా ఏమి..?
ప్రభుత్వం నిబంధనలు రూపొందించకపోవడం వల్ల ప్రయాణికులు, డ్రైవర్లు, ప్లాట్‌ఫామ్‌లు అన్నీ గందరగోళంలో చిక్కుకున్నాయి. ఇది ప్రయాణికులకు అంతకంటే పెద్ద ధర కట్టిస్తున్నది. ఈ సమయంలో ప్రభుత్వం తక్షణం పునఃపరిశీలన చేసి, నిబంధనలు రూపొందించి, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ నైతికతను, ప్రయాణికుల ప్రయోజనాలను పరిరక్షించాల్సిన అవసరం ఉంది.
Read Also: ATMs: ఏటీఎంల్లో 73% పెరిగిన రూ.100, రూ.200 నోట్ల లభ్యత