సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం గట్టిగా స్పందించింది. డిజిటల్ అరెస్టుల పేరుతో ఆర్థిక మోసాలకు పాల్పడుతున్న నేరగాళ్లను గుర్తించి, వారి అక్రమ కార్యకలాపాలను నిలువరించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో ఫిబ్రవరి నెలలో 7.81 లక్షల సిమ్ కార్డులను, 83,668 వాట్సాప్ ఖాతాలను నిలిపివేసినట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ లోక్‌సభలో వెల్లడించారు.
నకిలీ పత్రాలతో సిమ్ కార్డుల మోసం
సైబర్ మోసగాళ్లు నకిలీ పత్రాలతో సిమ్ కార్డులు తీసుకుని, వాటిని ఉపయోగించి పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతున్నారు. దీనిని అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటివరకు 2,08,469 ఐఎమ్‌ఈఐ నంబర్లను నిలిపివేసినట్లు బండి సంజయ్ తెలిపారు. ప్రతి ఫోన్‌కు ప్రత్యేకంగా కేటాయించే ఐఎమ్‌ఈఐ (IMEI) నంబర్లను బ్లాక్ చేసి, సైబర్ నేరగాళ్ల చర్యలను అణచివేసేందుకు భారత సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ కృషి చేస్తోంది.

సైబర్ మోసాలను గుర్తించే చర్యలు
డిజిటల్ అరెస్టుల కోసం వినియోగిస్తున్న 3,962 స్కైప్ ఐడీలను, 83,668 వాట్సాప్ ఖాతాలను గుర్తించి ప్రభుత్వం బ్లాక్ చేసింది. 2021లో ప్రారంభమైన సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ద్వారా ఇప్పటివరకు 13.36 లక్షలకు పైగా ఫిర్యాదులు అందాయి. ప్రభుత్వం సుమారు రూ. 4,386 కోట్లు కాపాడగలిగింది.
మహిళలు, చిన్నారుల భద్రతపై ప్రత్యేక దృష్టి
సైబర్ నేరగాళ్లు ప్రధానంగా మహిళలు, చిన్నారులపై దృష్టి సారించి మోసాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో, వారి భద్రతను కాపాడేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని బండి సంజయ్ తెలిపారు. సైబర్ నేరాలకు సంబంధించి ఫిర్యాదు చేయడానికి సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (https://cybercrime.gov.in) అందుబాటులో ఉందని, వచ్చిన ఫిర్యాదులను పోలీసులు పరిగణనలోకి తీసుకుని చర్యలు తీసుకుంటారని ఆయన వివరించారు.