చార్‌ధామ్ యాత్రను భారతదేశంలో అత్యంత పవిత్రమైన ధార్మిక యాత్రలలో ఒకటిగా భావిస్తారు. ఈ యాత్రలో భాగంగా ఉన్న నాలుగు ప్రధాన దేవాలయాల్లో (యమునోత్రీ, గంగోత్రీ, కేదార్‌నాథ్, బద్రీనాథ్) చివరిగా బద్రీనాథ్ ఆలయ తలుపులు ఈరోజు ఉదయం 6 గంటలకు ఘనంగా తెరచుకున్నాయి. ఈ సందర్భంగా ఆకాశం నుంచి హెలికాప్టర్ల ద్వారా పుష్పవర్షం కురిపించారు.

బద్రీనాథ్ ఆలయ ప్రాముఖ్యత
బద్రీనాథ్ ఆలయం ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో హిమాలయాల మధ్య నెలకొన్న పవిత్ర పుణ్యక్షేత్రం. ఇది వైష్ణవ సంప్రదాయానికి చెందిన ఆలయంగా భావించబడుతుంది. శ్రీమహావిష్ణువు బద్రీనారాయణ రూపంలో ఇక్కడ పూజలందుకుంటున్నారు. చార్‌ధామ్ యాత్రలో బద్రీనాథ్ ఆలయం చివరిగా దర్శించాల్సిన కేంద్రంగా పరిగణించబడుతుంది.
ఈ ఉదయం 6 గంటలకు ఆలయ ద్వారాలు తెరవబడిన వెంటనే వేలాదిగా భక్తులు స్వామివారిని దర్శించేందుకు బద్రీనాథ్‌కు తరలివచ్చారు. దాదాపు పదివేల మందికిపైగా భక్తులు దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుండి కూడా ఈ పవిత్ర ఘట్టానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా హెలికాప్టర్ ద్వారా భక్తులపై పుష్పవర్షం కురిపించడం అద్భుతమైన దృశ్యాన్ని అందించింది. ఇక, ఈరోజు ఆలయ ద్వారాలను తెరిచిన సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. దాదాపు 40 క్వింటాళ్ల బంతిపువ్వులతో అందంగా తీర్చిదిద్దారు. ఛార్‌దామ్ యాత్రలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలు శుక్రవారం (మే 2న) ఉదయం 7 గంటలకు తెరుచుకున్న విషయం తెలిసిందే. అంతకుముందు అక్షయ తృతీయ రోజున (ఏప్రిల్ 30న) గంగోత్రి, యమునోత్రి ఆలయ ద్వారా తెరుచుకున్నాయి.
సీఎం పుష్కర్ ధామి పూజలు
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పుష్కర్ ధామి స్వయంగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ తలుపులు తెరిచిన అనంతరం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత మీడియాతో మాట్లాడుతూ, ఈ రోజు చాలా పవిత్రమైన రోజు. ఇవాళ బద్రినాథుడి ద్వారములు తెరుచుకున్నాయి. ఉత్తరాఖండ్ పవిత్ర భూమికి చేరుకున్న యాత్రికులందరినీ నేను స్వాగతిస్తున్నాను. యాత్రికులందరి ప్రయాణం సజావుగా పూర్తి కావాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధాని మోదీ నాయకత్వంలో బద్రినాథుడి ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రూ. 1700 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను మంజూరు చేయించామని వెల్లడించారు. ఇందులో మొదటి విడతగా రూ. 292 కోట్లు నిన్న విడుదలయ్యాయి. ఇందుకుగాను ప్రధాని,హోంమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని ముఖ్యమంత్రి ధామి అన్నారు.
భద్రతా ఏర్పాట్లు
ఇటీవలి జమ్మూకశ్మీర్ ఉగ్రదాడుల నేపథ్యంలో చార్‌ధామ్ యాత్రకు భద్రతను అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం, ఉత్తరాఖండ్ ప్రభుత్వం కలిసి పోలీస్, పారామిలటరీ, ఐటీబీపీ బలగాలతో భద్రతను కట్టుదిట్టంగా ఏర్పాటు చేశాయి. సీసీ కెమెరాలు, డ్రోన్ పర్యవేక్షణ, ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్ ద్వారా పటిష్టమైన ఏర్పాట్లు జరిగాయి.
Read also: Kedarnath: కేదార్‌నాథ్ ఆలయానికి పోటెత్తిన భక్తులు