ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్, చంద్రబాబు మధ్య దూరం పెరిగిందని, పవన్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అలిగారని ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి. ముఖ్యంగా, ఇటీవల జరిగిన క్యాబినెట్ మీటింగ్‌కి పవన్ హాజరుకాకపోవడంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. అయితే, విజయవాడలో జరిగిన తమన్ మ్యూజికల్ నైట్‌లో పవన్ కళ్యాణ్, చంద్రబాబు సరదాగా మాట్లాడుకుంటూ కనిపించడంతో ఈ రూమర్లకు చెక్ పడినట్టైంది.

పవన్ కళ్యాణ్ నిజంగా అలిగారా?
గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ టీడీపీ వైఖరిపై అసంతృప్తిగా ఉన్నారంటూ సోషల్ మీడియాలో అనేక వార్తలు వైరల్ అయ్యాయి. మరింతగా, తన అనారోగ్యం కారణంగా అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉన్నారనే జనసేన వెర్షన్ కూడా వినిపించింది. జనసేన పార్టీ కార్యక్రమాలను నాగబాబు ద్వారా నిర్వహించడమే కాకుండా, క్యాబినెట్ సమావేశానికి కూడా హాజరుకాకపోవడంతో చంద్రబాబు స్వయంగా జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్‌ను పవన్ గైర్హాజరుకు గల కారణాలను అడిగి తెలుసుకున్నట్లు వార్తలు వచ్చాయి.
పవన్ అసంతృప్తికి కారణాలు?
పవన్ కళ్యాణ్ అసంతృప్తిగా ఉండడానికి మరో కారణం, లోకేష్‌ను ఉప ముఖ్యమంత్రిగా చేస్తారన్న వార్తలపై టీడీపీ నుంచి ఎలాంటి ఖండన రాకపోవడం అని అనుకున్నారు. జనసేనకు సంబంధించి ఎమ్మెల్యేలు గెలిచిన చోట కూడా టీడీపీ నేతలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని పవన్ భావించారట. ఈ క్రమంలో, ఆయన తన కుమారుడు అకిరా నందన్‌తో కలిసి దక్షిణ భారతదేశంలోని పలు దేవాలయాలను సందర్శించడమే కాకుండా, కొన్ని రోజుల పాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే, అనారోగ్యంతో ఉన్న పవన్ కళ్యాణ్ ఆలయ యాత్రకు ఎలా వెళ్లగలిగారు? అనే ప్రశ్నలు కూడా ప్రత్యర్థుల నుంచి వచ్చాయి.
మ్యూజికల్ నైట్‌లో పవన్ – చంద్రబాబు చట్టాపట్టాలు
ఈ అనుమానాలకు తెరదించుతూ విజయవాడలో జరిగిన ‘యుఫోరియా’ మ్యూజికల్ నైట్‌లో పవన్ కళ్యాణ్, చంద్రబాబు పక్కపక్కనే కూర్చొని సరదాగా మాట్లాడుకోవడం విశేషం. ఈ కార్యక్రమానికి నారా భువనేశ్వరి పవన్ కళ్యాణ్‌ను స్వాగతం పలికారు. అంతేకాకుండా, బాలకృష్ణ, నారా లోకేష్ కూడా పవన్, చంద్రబాబు వెంటనే కూర్చుని మాట్లాడుకుంటూ కనిపించడం జనసేన – టీడీపీ అనుచరులకు మాంచి ఊరటనిచ్చింది.
రాజకీయంగా పవన్ – చంద్రబాబు బంధం నిలకడగా?
ఈ కార్యక్రమంతో పవన్ కళ్యాణ్ టీడీపీపై అసంతృప్తిగా ఉన్నారన్న ఊహాగానాలకు ఫుల్‌స్టాప్ పడింది. రాజకీయంగా జనసేన, టీడీపీ కూటమి మధ్య ఎలాంటి విబేధాలు లేవన్న సందేశాన్ని ఈ మ్యూజికల్ నైట్ స్పష్టంగా ఇచ్చినట్లు కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ క్యాబినెట్ సమావేశానికి హాజరుకాకపోయినా, కూటమిలో ఏదైనా లోపాలుంటే ఇలాంటి వేడుకల్లో పక్కపక్కనే ఉండరని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో జనసేన – టీడీపీ మధ్య బంధం ఇప్పటికీ సుస్థిరంగా ఉందని భావించొచ్చు.