ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మందుబాబులకు షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో మద్యం ధరలను 15 శాతం పెంచుతూ ఏపీ ఎక్సైజ్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి దేశీయ మద్యం, విదేశీ మద్యం, బీర్ ఇలా మూడు కేటగిరీలుగా మద్యం సరఫరా జరగనుంది. అంతేకాకుండా, దేశీయంగా తయారయ్యే విదేశీ మద్యం, విదేశీ మద్యం బ్రాండ్లపై అదనపు ఏఈఆర్‌టీ (Additional Excise Retail Tax) విధించనున్నారు.

ఇప్పటికే మద్యం అమ్మకాలపై మార్జిన్‌ను 14.5 శాతం నుంచి 20 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. తాజా నిర్ణయంతో రూ.99లకే లభించే బీర్, కొన్ని బ్రాండ్ల మినహా మిగతా మద్యం రేట్లు పెరిగాయి. ఇది మందుబాబులపై ఆర్థిక భారం పెరిగేలా చేస్తుందని అంటున్నారు. ఈ మార్పులు తక్షణమే అమల్లోకి వచ్చాయి. ఇక ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కొత్త లిక్కర్ పాలసీ తీసుకువచ్చింది. 2024 అక్టోబర్‌లో అమలులోకి వచ్చిన ఈ పాలసీ ప్రకారం మద్యం షాపుల నిర్వహణను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారు. దాదాపు 3,000 దుకాణాలకు లైసెన్సులు జారీ చేయగా, షాపుల యజమానులు మార్జిన్ పెంచాలంటూ ప్రభుత్వాన్ని కోరారు. దీనికి స్పందించిన ప్రభుత్వం మార్జిన్‌ను 20 శాతానికి పెంచింది.
దీనికి తోడు గీత కార్మిక కులాలకు 10 శాతం మద్యం దుకాణాలను కేటాయించిన సంగతి తెలిసిందే. లైసెన్సుల జారీ కోసం లాటరీ విధానం ద్వారా లైసెన్సుదారులను ఎంపిక చేయగా, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా 15 జిల్లాల్లో ఈ ప్రక్రియ వాయిదా పడింది. అయితే మిగతా జిల్లాల్లో లాటరీ ప్రక్రియ పూర్తయింది. ఇప్పటి వరకు మద్యం షాపుల లైసెన్సుల కోసం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, గోదావరి, గుంటూరు, కృష్ణా, పల్నాడు జిల్లాల్లో ప్రక్రియ నిలిచిపోయింది. వీటి పరిధిలోని 202 దుకాణాలకు మరోసారి లాటరీ తీయనున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయాలతో మద్యం వ్యాపారులు, వినియోగదారులపై ప్రభావం పడే అవకాశముందని విశ్లేషకులు అంటున్నారు.