న్యూఢిల్లీ: అయోధ్యలో కొత్త నిర్మించిన రామ మందిరంలో రామ్‌లల్లాను ప్రతిష్టాపన చేసి ఏడాది కావొస్తోంది. ఈ నేపథ్యంలో తొలి వార్షికోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ దేశ ప్రజలకు గ్రీటింగ్స్ తెలిపారు. ఎక్స్ అకౌంట్‌లో ఆయన పోస్టు చేస్తూ.. భారతీయ సంస్కృతి, ఆధ్మాత్మికతకు గొప్ప వారసత్వంగా ఈ ఆలయం నిలుస్తుందని ఆయన అన్నారు. ఎన్నో శతాబ్ధాల త్యాగాలు, పోరాటాల ద్వారా ఆలయాన్ని నిర్మించినట్లు చెప్పారు. నూతన భారత్‌ను నిర్మించే అంశంలో ఈ దివ్య, భవ్య అయోధ్య రామాలయం దేశ ప్రజలకు ప్రేరణగా నిలుస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు.
మరోవైపు ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్య రామ్‌లల్లా రామాలయ ప్రథమ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. జనవరి 11 నుంచి 13వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఈ వేడుకలను నిర్వహించనున్నారు. ఈ మేరకు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. సుమారు 5వేల మంది కూర్చుని వేడుకలను తిలకించేందుకు వీలుగా అంగద్ తీలా ప్రదేశంలో జర్మన్ హ్యాంగర్ టెంట్ ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచే సాంస్కృతిక ప్రదర్శనలు, రామ్ కథ ప్రవచనాలు, ప్రత్యేక పూజ కార్యక్రమాలను వీక్షించవచ్చు.

శ్రీరామజన్మభూమి తీర్థ కేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మాట్లాడుతూ.. “జనవరి 11వ తేదీతో అయోధ్య లో రామ మందిరం నిర్మించి ఏడాది పూర్తవుతుంది. గత సంవత్సరం రామ్‌లల్లా ప్రతిష్టోత్సవానికి హాజరు కాలేని భక్తులను ఈ సంవత్సరం ఆహ్వానించాలని ట్రస్ట్ నిర్ణయం తీసుకుంది. దేశం నలుమూలల నుంచి పూజారులు, భక్తులకు ఇప్పటికే ఆహ్వానాలు పంపాం. ఈ మూడు రోజుల ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి రామ్ కథ ప్రవచనాలు, రామ్ చరిత మానస్ (మానస్ ప్రవచన్)పై ఉపన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. రోజూ ఉదయం ప్రసాద పంపిణీ ఉంటుంది. ఇక ఆలయ అలంకరణ పనులు, ఉత్సవ ఏర్పాట్లు చివరిదశకు చేరుకున్నాయి. 110 మంది ప్రముఖ అతిథులు వార్షికోత్సవానికి హాజరవుతున్నారు. కనీసం ఒక్క రోజు అయినా అయోధ్యను సందర్శించాలని భక్తులను కోరుతున్నాం, అని చంపత్ రాయ్ పేర్కొన్నారు.
కాగా, జనవరి 22, 2024న జరిగిన రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్టోత్సవం ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో జరిగింది. ఈ చారిత్రక ఘట్టాన్ని తిలకించేందుకు లక్షలాది భక్తులు తరలివచ్చారు. సుదూర ప్రాంతాల భక్తులు ప్రతిష్టోత్సవాన్ని టీవీల్లో వీక్షించారు.