శుక్రవారం రాత్రి అయోధ్య ఎక్స్‌ప్రెస్ రైలుకు బాంబు బెదిరింపు కాల్ రావడంతో రైల్వే అధికారులు, ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. లక్నో చార్బాగ్ స్టేషన్ చేరేలోపు రైలును పేల్చివేస్తామని బెదిరింపు సందేశం అందింది. ఈ సమాచారం వచ్చిన వెంటనే రైలును నిలిపివేసి, బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. అయితే, ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
బెదిరింపు కాల్
శుక్రవారం రాత్రి 112 అత్యవసర నంబర్‌కు వచ్చిన బెదిరింపు కాల్‌లో, అయోధ్య ఎక్స్‌ప్రెస్ (14205) లో బాంబు పెట్టారని, రైలు లక్నో చార్‌బాగ్ స్టేషన్‌కు చేరుకునేలోపు పేలిపోతుందని ఒక గుర్తుతెలియని వ్యక్తి హెచ్చరించాడు. ఈ సమాచారంతో పోలీసులు అప్రమత్తమై బారాబంకి స్టేషన్ వద్ద రైలును ఆపారు. పోలీసు బందోబస్తుతో పాటు, బాంబు స్క్వాడ్, సెర్చ్ టీములు రైలును ఖాళీ చేయించి, ప్రతి కోచ్‌ను సమగ్రంగా తనిఖీ చేశాయి.
స్క్వాడ్‌లు తనిఖీలు
రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, గవర్నమెంట్ రైల్వే పోలీస్, బాంబు డిస్పోజల్ స్క్వాడ్‌లు కలిసి రైలులో తనిఖీలు నిర్వహించాయి. విచారణలో, S-8 కోచ్ టాయిలెట్‌లో “బాంబ్ మినీ RDX 8/7 UC 100 mm టైమర్” అనే సందేశాన్ని బృందాలు గుర్తించాయి. ఇది ప్రయాణికుల్లో మరింత భయాందోళనకు కారణమైంది. అంతేకాకుండా, S-4/S-5 కోచ్‌లలోని డఫెల్ బ్యాగ్‌లో బాంబును దాచిపెట్టారని సమాచారం రావడంతో మరింత తీవ్రంగా అన్వేషణ సాగింది.

దర్యాప్తు
ఎక్కడా పేలుడు పదార్థాలు లభించలేదు. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. రైలు ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించేందుకు అనుమతి ఇచ్చారు. అయితే, ఈ ఘటనలో ఎవరైనా కావాలని అశాంతిని సృష్టించేందుకు ఈ కాల్ చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు చేశారు? అనే విషయాలను పోలీసులు గట్టి దర్యాప్తు చేస్తున్నారు.ఈ ఘటనపై పై స్థాయి అధికారులు స్పందించి, ఇది సాధారణ బెదిరింపు కాల్‌గా ముగించకుండా లోతుగా విచారణ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రయాణికుల భద్రతే ప్రధాన లక్ష్యమని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రయాణికులు భయం
దాదాపు రెండు గంటలపాటు ప్రయాణికులు భయంతో గడపాల్సి వచ్చింది. ఇకపై ఇలాంటి బెదిరింపు కాల్స్‌ను చాలా జాగ్రత్తగా పరిశీలించి, అవసరమైన చర్యలు తీసుకోవాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం, ఈ కేసు వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించేందుకు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది.“రాత్రి 7.30 గంటల ప్రాంతంలో రైలు బారాబంకి స్టేషన్‌కు చేరుకునే సమయానికి, ఇప్పటికే భారీ పోలీసు బందోబస్తు ఉంది. బాంబు స్క్వాడ్, సెర్చ్ స్క్వాడ్‌లు ప్రతి కోచ్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేశాయి” అని పోలీసు సూపరింటెండెంట్ దినేష్ కుమార్ సింగ్ తెలిపారు. వెంటనే, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, గవర్నమెంట్ రైల్వే పోలీస్, బాంబు డిస్పోజల్ స్క్వాడ్ రైలులో సమగ్ర శోధనను ప్రారంభించాయని పోలీసు అధికారులు తెలిపారు.