ప్రజాస్వామ్యంలో పార్లమెంట్ సమావేశాలు అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంటాయి. చట్టాల తయారీ, ప్రభుత్వ విధానాలపై చర్చలు, ప్రజా సమస్యల పరిష్కారానికి ఇవే ప్రధాన వేదిక. ప్రజల భాధ్యతను మోయాల్సిన ఎంపీలు సభ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనాలి. ఈ క్రమంలో తెలంగాణ నుంచి పార్లమెంట్‌కు ఎన్నికైన 17 మంది ఎంపీల హాజరు శాతం, వారు అడిగిన ప్రశ్నలు, పాల్గొన్న చర్చల వివరాలను వెలిబుచ్చే గణాంకాలు ఆసక్తికరంగా ఉన్నాయి.
జూన్ 2024 నుంచి ఏప్రిల్ 2025 వరకు జరిగిన పార్లమెంట్ సమావేశాలు
జూన్ 2024 నుంచి ఏప్రిల్ 2025 వరకు జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి 100 శాతం హాజరుతో టాప్‌లో నిలిచారు. ఆయన 79 ప్రశ్నలు వేసి, 17 చర్చల్లో పాల్గొన్నారు. బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి 95 శాతం హాజరుతో రెండో స్థానంలో ఉండగా, బీజేపీ నేత ఈటల రాజేందర్ అత్యధికంగా 80 ప్రశ్నలు వేసి, 91 శాతం హాజరుతో తన చురుకుదనాన్ని చాటుకున్నారు. ఇక ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ 21 చర్చల్లో పాల్గొనడం గమనార్హం.

కాంగ్రెస్ ఎంపీ కుందూరు రఘువీర్ ఒక్క చర్చలో కూడా పాల్గొనలేదు
మరోవైపు, కొంతమంది ఎంపీలు తక్కువ హాజరుతో పాటు, తక్కువ ప్రశ్నలు వేయడం, చర్చల్లో పాల్గొనకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఉదాహరణకు కాంగ్రెస్ ఎంపీ కుందూరు రఘువీర్ కేవలం 8 ప్రశ్నలు వేసి, 72 శాతం హాజరుతో ఒక్క చర్చలోనూ పాల్గొనలేదు. ఇదే సమయంలో ఇతర ఎంపీల హాజరు శాతం, చర్చలలో భాగస్వామ్యం కూడా ఎంపీగా వారి నిబద్ధతను ప్రతిబింబిస్తోంది. ఈ గణాంకాలపై ప్రజల దృష్టి కేంద్రీకరించడంతో భవిష్యత్తులో ఎంపీలు మరింత చురుగ్గా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.