తెలంగాణ సచివాలయం వద్ద మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ యూనివర్సిటీల్లో పని చేస్తున్న పార్ట్ టైం ఉద్యోగులు జీవో 21 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సచివాలయ ముట్టడికి యత్నించారు. ప్రభుత్వానికి తమ డిమాండ్లను తెలియజేయడానికి భారీగా హాజరైన నిరసనకారులు, మద్దతుదారులతో సెక్రెటరియేట్ చుట్టూ పరిస్థితి టెన్షన్ గా మారింది.

ఈ నిరసనలో పాల్గొన్న ఉద్యోగులు, తాము సంవత్సరాల తరబడి సేవలందిస్తున్నప్పటికీ ప్రభుత్వం తమను రెగ్యులరైజ్ చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో 21 అమలుతో తమ భవిష్యత్ అనిశ్చితిలో పడిపోయిందని, తక్షణమే దానిని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. పార్ట్ టైం మరియు కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి, తగిన జీతభత్యాలు ఇవ్వాలని వారు స్పష్టం చేశారు.
పోలీసులకు నిరసనకారుల మధ్య తోపులాట
అయితే, నిరసనకారులను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ముట్టడిని అడ్డుకునే ప్రయత్నంలో పోలీసులు, నిరసనకారుల మధ్య తోపులాట జరిగింది. అనంతరం కొందరిని అరెస్ట్ చేసినట్లు సమాచారం. పరిస్థితిని అదుపులోకి తేవడంలో పోలీసులు తక్షణమే స్పందించారు. ప్రస్తుతం సచివాలయం పరిసరాల్లో భద్రతను మరింత కఠినంగా చేశారు. ఉద్యోగ సంఘాలు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని, ప్రభుత్వానికి చురకలు అంటించేందుకు మరోసారి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించాయి.