వాషింగ్టన్: 2021 జనవరి 6న క్యాపిటల్ హిల్ భవనం మీద దాడి చేసిన కేసులో దోషులుగా తేలిన సుమారు 1,600 మందికి క్షమాభిక్ష పెడుతూ ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో, నాటి అల్లర్ల ప్రధాన సూత్రధారితో సహా వందల మంది జైళ్ల నుంచి విడుదల కానున్నారు. రెండోసారి బాధ్యతలు తీసుకున్న తొలి రోజే ఆయన అనేక కీలక ఆదేశాలు ఇచ్చారు. జనవరి 6 ఘటనలో నమోదు అయిన 450 క్రిమినల్ కేసులను కూడా డిస్మిస్ చేయాలని అటార్నీ జనరల్‌ను ట్రంప్ ఆదేశించారు.
క్యాపిటల్ హిల్‌పై అటాక్ అమెరికా చరిత్రలోనే హింసాత్మక ఘటనగా రికార్డు అయ్యింది. ఆ ఘటనపై విచారణ చేపట్టేందుకు అమెరికా న్యాయశాఖ తీవ్ర కసరత్తులు చేసింది. 2020 ఎన్నికల్లో ట్రంప్ ఓడిన తర్వాత ఆ పరాజయాన్ని జీర్ణించుకోలేకపోయిన ఆయన అభిమానులు క్యాపిటల్ హిల్‌పై దాడికి దిగారు. ఆ సమయంలో జరిగిన హింసలో వందల సంఖ్యలో పోలీసులు కూడా గాయపడ్డారు. అధికార మార్పిడి సమయంలో ఆ హింస చోటుచేసుకున్నది. అయితే క్యాపిటల్ హిల్‌పై అటాక్ చేసిన కేసులో ట్రంప్ మద్దతుదారుల్ని ఇన్నాళ్లు పోలీసులు విచారించగా, ఇప్పుడు ఆ ఆందోళనకారులకు ట్రంప్ క్షమాభిక్ష పెట్టడం.. అమెరికా పోలీసు శాఖకు మింగుడుపడడం లేదు.

అంతేకాక..మెక్సికో నుంచి అక్రమ వలసలను అడ్డుకునేందుకు అమెరికా దక్షిణ సరిహద్దుల్లో నేషనల్ ఎమర్జెన్సీ విధిస్తున్నట్టు ప్రకటించారు. ప్రమాణ స్వీకారోత్సవం జరిగిన చోటే మొదట పలు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశారు. అనంతరం వైట్‌హౌస్‌కు వెళ్లిన తర్వాత మరికొన్ని కీలకమైన నిర్ణయాలకు సంబంధించిన ఆర్డర్లను జారీ చేశారు. జో బైడెన్ హయాంలో తీసుకున్న 78 నిర్ణయాలను రద్దు చేస్తూ ట్రంప్ తొలి సంతకం చేశారు. కొత్త ప్రభుత్వం పాలనపై పూర్తిస్థాయి పట్టు సాధించేదాకా అధికారులు కొత్తగా ఎలాంటి నియంత్రణలు విధించే అవకాశం లేకుండా నిరోధించే ఆర్డ్‌ర్‌పై ట్రంప్ రెండో సంతకం చేశారు.
కొత్త ప్రభుత్వం పూర్తిస్థాయిలో పట్టు సాధించే వరకూ ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలను నిలిపివేస్తూ ట్రంప్ మరో ఆర్డర్ జారీ చేశారు. అయితే, సైన్యంతో పాటు మరికొన్ని విభాగాల్లో నియామకాలకు మినహాయింపు ఉంటుంది. ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగులంతా ఆఫీసుల్లో విధులకు ప్రత్యక్షంగా హాజరు కావాల్సిందేనంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలను తక్షణమే అమలు చేయాలన్నారు.