ఏటీఎం విత్‌డ్రా ఛార్జీలు పెరుగుతున్నాయ్
దేశవ్యాప్తంగా డిజిటల్ లావాదేవీల ప్రాముఖ్యత పెరిగినా, ఇప్పటికీ క్యాష్ ట్రాన్సాక్షన్లు ఓ పెద్ద శాతం ప్రజల జీవితాల్లో భాగమై ఉన్నాయి. చాలా మంది ఇంకా రోజువారీ అవసరాలకు నగదు వాడుతూనే ఉన్నారు. అయితే, ఇప్పుడు ఏటీఎం విత్‌డ్రా ఛార్జీల పెంపు వార్త వినిపిస్తోంది. 2025 మే 1 నుంచి ఏటీఎం లావాదేవీలపై అదనపు ఛార్జీలు వర్తించనున్నాయి. దీంతో వినియోగదారులు నగదు ఉపసంహరణలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తీసుకున్న తాజా నిర్ణయం మేరకు, నెలకు ఉచితంగా అందుబాటులో ఉన్న ట్రాన్సాక్షన్లు పూర్తయిన తర్వాత చేసే ప్రతి విత్‌డ్రాపై అదనంగా రూ.23 చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ఛార్జీ రూ.21గా ఉండగా, ఇప్పుడు ఇది రూ.2 పెరిగింది.
ఏటీఎం లావాదేవీల పరిమితులు మరియు ఛార్జీలు
ప్రస్తుతం RBI మార్గదర్శకాల ప్రకారం, ప్రతి ఖాతాదారుడు తన బ్యాంకు ఏటీఎంలో ఐదు ఉచిత లావాదేవీలు చేయవచ్చు. వీటిలో నగదు విత్‌డ్రా చేయడం, బ్యాలెన్స్ చెక్ చేయడం, మినీ స్టేట్‌మెంట్ పొందడం వంటి కార్యకలాపాలు ట్రాన్సాక్షన్లుగా పరిగణించబడతాయి. ఇతర బ్యాంకుల ఏటీఎంలను ఉపయోగించినప్పుడు మెట్రో నగరాల్లో నెలకు మూడు ఉచిత లావాదేవీలు, మెట్రో కాని ప్రాంతాల్లో ఐదు ఉచిత లావాదేవీలు లభిస్తాయి. ఈ పరిమితిని దాటి మరింత నగదు ఉపసంహరించినప్పుడు కొత్తగా నిర్ణయించిన రూ.23 ఛార్జీ అమల్లోకి వస్తుంది.
ఏటీఎం ఇంటర్‌ఛేంజ్ ఫీజు అంటే ఏమిటి?
బ్యాంకులు తమ ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించేందుకు ఇతర బ్యాంకుల ఏటీఎంలను కూడా వినియోగించుకునేలా అనుమతిస్తున్నాయి. అయితే, ఇది బ్యాంకులకు ఓ ఖర్చుగా మారుతుంది. అందుకే, ఏటీఎం ఇంటర్‌ఛేంజ్ ఫీజు అనే విధానాన్ని ప్రవేశపెట్టారు. ఉదాహరణకు, ఒక వ్యక్తి ICICI బ్యాంక్ ఖాతాదారు అయితే, కానీ SBI ఏటీఎం నుంచి నగదు ఉపసంహరించుకుంటే, SBI బ్యాంక్ ICICI బ్యాంక్‌కు ఇంటర్‌ఛేంజ్ ఫీజును వసూలు చేస్తుంది. ఇప్పుడు ఈ ఫీజును కూడా రూ.2 పెంచేందుకు NPCI (నేషనల్ ప్రెమెంట్స్ కార్పొరేషన్ అఫ్ ఇండియా) అంగీకరించింది.
ఏటీఎం ఛార్జీలు ఎందుకు పెంచుతున్నారు?
ఇటీవల ఏటీఎం నిర్వహణకు సంబంధించిన ఖర్చులు పెరిగాయి. 2024 జూన్‌లో ఏటీఎం ఆపరేటర్లు తమ సేవలను లాభదాయకంగా మార్చుకోవడానికి రూ.23 ఫీజును డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఉన్న ఛార్జీలు సరిపోవడం లేదని, వాటిని పెంచాల్సిన అవసరం ఉందని RBIకి అభిప్రాయం తెలిపారు. దీనిపై పరిశీలన చేయడానికి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), HDFC బ్యాంక్ అధికారులు కలిసిన కమిటీని RBI ఏర్పాటు చేసింది. కమిటీ ఇచ్చిన సిఫారసుల మేరకు ఏటీఎం నిర్వహణ ఖర్చులను భరించేందుకు విత్‌డ్రా ఫీజులను పెంచాలని నిర్ణయించారు.
నూతన ఛార్జీల ప్రభావం వినియోగదారులపై ఎలా ఉంటుంది?
ఏటీఎం లావాదేవీల ఛార్జీల పెంపు దాదాపు అన్ని బ్యాంక్ ఖాతాదారులపై ప్రభావం చూపనుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వినియోగదారులు దీని ప్రభావాన్ని ఎక్కువగా అనుభవించవచ్చు. డిజిటల్ పేమెంట్లను పూర్తి స్థాయిలో వినియోగించలేని వ్యక్తులకు ఇది భారం కావొచ్చు. అయితే, నగదు విత్‌డ్రా చేసే ముందు కొన్ని విషయాలను గుర్తుంచుకుంటే, ఖర్చును నియంత్రించుకోవచ్చు.
ఒక నెలకు ఉచితంగా లభించే ట్రాన్సాక్షన్లను సద్వినియోగం చేసుకోవాలి
బ్యాంకు ఏటీఎంలలో నెలకు ఐదు ఉచిత ట్రాన్సాక్షన్లు ఉంటాయి.
ఇతర బ్యాంకుల ఏటీఎంలలో మెట్రో నగరాల్లో మూడు, ఇతర ప్రాంతాల్లో ఐదు ఉచిత లావాదేవీలు లభిస్తాయి.
ఫ్రీ లిమిట్‌ను దాటితే రూ.23 ఫీజు చెల్లించాలి.
డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహించాలి
యూపీఐ, గూగుల్ పే, ఫోన్ పే, పే టిఎమ్, వంటి డిజిటల్ చెల్లింపు మార్గాలను ఎక్కువగా ఉపయోగించుకోవడం ద్వారా ఎటిఎంకి వెళ్లే అవసరాన్ని తగ్గించుకోవచ్చు.
డెబిట్/క్రెడిట్ కార్డ్ ద్వారా లావాదేవీలు చేయడం ద్వారా కూడా నగదు వినియోగాన్ని తగ్గించుకోవచ్చు.
ఒకేసారి ఎక్కువ మొత్తంలో నగదు ఉపసంహరణ చేయడం మంచిది
నెలలో ఒకేసారి మొత్తం నగదు విత్‌డ్రా చేయడం ద్వారా ఏటీఎం సందర్శనలను తగ్గించుకోవచ్చు.
చిన్న మొత్తాల నగదు డ్రా చేయడం వల్ల ఎక్కువ ట్రాన్సాక్షన్లు కావచ్చు, ఫీజులు పెరిగే ప్రమాదం ఉంటుంది.
RBI నిర్ణయం – బ్యాంకింగ్ రంగంపై దీని ప్రభావం
ఈ నిర్ణయం బ్యాంకులకు మరియు ఏటీఎం ఆపరేటర్లకు మెరుగైన ఆదాయాన్ని తెచ్చిపెట్టే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో, ఏటీఎం నిర్వహణకు అధిక ఖర్చులు అవుతున్నాయని బ్యాంకులు చెబుతున్నాయి. మూసివేయబడుతున్న ఏటీఎంల సంఖ్య పెరుగుతున్నందున, భవిష్యత్తులో మరింత ఆధునిక సాంకేతికతను ఉపయోగించి మరింత సమర్థవంతమైన సేవలను అందించేందుకు ఈ ఛార్జీలు ఉపయోగపడతాయి.