మన దేశంలో ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న. ఏటా కేంద్ర ప్రభుత్వం ప్రకటించే భారతరత్న అవార్డు కోసం అన్ని రాష్ట్రాలు పలువురి పేర్లను సిఫారసు చేస్తూ ఉంటాయి. అయితే దేశవ్యాప్తంగా ఎంతోమందికి భారతరత్న ఇవ్వాలనే డిమాండ్లు వెల్లువెత్తుతూనే ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం.. తమ వద్దకు వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి.. అందులో నుంచి ఎంపిక చేసి.. వారికి భారతరత్న ప్రకటించడం సంప్రదాయం. అయితే రాష్ట్రీయ జనతా దళ్-ఆర్జేడీ చీఫ్, బిహార్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు దేశ అత్యున్నత పురస్కారం అయిన భారతరత్న ఇవ్వాలని ఆ పార్టీ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోంది. తాజాగా మరోసారి బిహార్ అసెంబ్లీలో ఈ ప్రతిపాదనను తీసుకురాగా.. అసెంబ్లీ దాన్ని తిరస్కరించడం గమనార్హం.

కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయాలని మనవి
లాలూ యాదవ్‌కు భారతరత్న ఇవ్వాలనే ప్రతిపాదనను బుధవారం బిహార్ అసెంబ్లీ తిరస్కరించింది. ఆర్జేడీ ఎమ్మెల్యే ముఖేష్ రోషన్ లాలూ భారతరత్న ప్రతిపాదనను మరోసారి బిహార్ అసెంబ్లీలో ప్రతిపాదిస్తూ.. లాలూ యాదవ్ పేరును కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయాలని బిహార్ ప్రభుత్వాన్ని కోరారు. ఎమ్మెల్యే ముఖేష్ రోషన్ చేసిన ప్రతిపాదనపై స్పందించిన.. బిహార్ అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి విజయ్ కుమార్ చౌదరి.. ఈ ఏడాది లాలూ యాదవ్‌కు భారతరత్న కోసం ఎలాంటి ప్రతిపాదన లేదని స్పష్టం చేశారు.
ప్రతిపాదనను ప్రవేశపెట్టిన ఎమ్మెల్యే ముఖేష్ రోషన్
అంతేకాకుండా ఈ ప్రతిపాదనను ప్రవేశపెట్టిన ఎమ్మెల్యే ముఖేష్ రోషన్.. తన ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని మంత్రి విజయ్ కుమార్ చౌదరి కోరారు. అయితే దానికి ఎమ్మెల్యే ముఖేష్ రోషన్ అంగీకరించలేదు. దీంతో స్పీకర్ నంద్ కిషోర్ యాదవ్ మూజువాణి ఓటుతో లాలూకు భారతరత్న ఇవ్వాలన్న ప్రతిపాదనను తిరస్కరించారు. ఈ ఏడాది చివరలో బిహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.