తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నేడు పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో హ్యాష్‌టాగ్‌లతో ట్రెండ్ అవుతున్న రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా మారాయి.

పవన్ కల్యాణ్ ప్రత్యేక శుభాకాంక్షలు
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రామ్ చరణ్ పట్ల తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ –వెండితెరపై కథానాయకుడిగా తనదైన శైలిని ఆవిష్కరిస్తున్న రామ్ చరణ్‌కు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. భగవంతుడు ఆయనకు మరిన్ని విజయాలు అందించాలని కోరుకుంటున్నాను. తొలి చిత్రం నుంచే ప్రేక్షకులను మెప్పిస్తూ, కొత్తదనాన్ని ప్రదర్శిస్తూ ముందుకెళ్తున్నారు. నటనలో విభిన్న శైలిని ప్రదర్శించడం, పెద్దల పట్ల గౌరవం, ఆధ్యాత్మికత, సమాజపట్ల బాధ్యత – ఇవన్నీ రామ్ చరణ్ ఎదుగుదలకు దోహదం చేస్తాయి. అని పవన్ తన ప్రకటనలో పేర్కొన్నారు. రామ్ చరణ్ 2007లో ‘చిరుత’ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసి తొలి సినిమాతోనే తన టాలెంట్‌ను నిరూపించుకున్నారు. అనంతరం ‘మగధీర’ సినిమా ఆయన కెరీర్‌ను మలుపు తిప్పిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమా టాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్ హిట్‌గా మారి ఆయనకు స్టార్ హీరో హోదాను అందించింది. ‘రంగస్థలం’ లాంటి ప్రయోగాత్మక కథలు, ‘RRR’ లాంటి పాన్-ఇండియా చిత్రాలతో ఆయన తన నటనా శైలి ఎంత విభిన్నమైనదో నిరూపించారు. రామ్ చరణ్ పుట్టినరోజును పురస్కరించుకుని అభిమానులు హైదరాబాద్, విశాఖ, విజయవాడ సహా పలు ప్రాంతాల్లో ప్రత్యేక కేక్ కటింగ్ వేడుకలు నిర్వహిస్తున్నారు. రామ్ చరణ్ అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టి పుట్టినరోజును మరింత ప్రాముఖ్యంగా మార్చుతున్నారు.