Ashutosh Sharma : నువ్వా-నేనా అన్నట్టుగా సాగిన మ్యాచ్ విశాఖపట్నంలో ఉత్కంఠభరితంగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) ఒక వికెట్ తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ)పై ఘన విజయం సాధించింది. ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్‌లు ఏకపక్షంగా సాగగా, ఈ మ్యాచ్ మాత్రం ప్రేక్షకులకు ఉత్కంఠను పంచింది.లక్నో జట్టు తొలుత బ్యాటింగ్ చేసి, 161/3 స్కోరు వద్ద పటిష్ట స్థితిలో కనిపించింది. బ్యాటర్లు చెలరేగిపోవడంతో భారీ లక్ష్యం ఖాయమనిపించింది. అయితే, ఢిల్లీ బౌలర్లు సమయోచితంగా రాణించి వరుసగా వికెట్లు తీయడంతో లక్నో 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 209 పరుగులకే పరిమితమైంది. లక్నో తరఫున మిచెల్ మార్ష్ 36 బంతుల్లో 72 పరుగులు (6 ఫోర్లు, 6 సిక్సర్లు) చేయగా, నికోలస్ పూరన్ 30 బంతుల్లో 75 పరుగులు (6 ఫోర్లు, 7 సిక్సర్లు) సాధించాడు. డేవిడ్ మిల్లర్ 27 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 3 వికెట్లు, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టారు.210 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్, మరో మూడు బంతులు మిగిలుండగానే 9 వికెట్లు కోల్పోయినా, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్ అద్భుత బ్యాటింగ్‌తో జట్టును విజయతీరాలకు చేర్చారు.మ్యాచ్ చివరి దశలో లక్నో పట్టు బిగిస్తుందనుకున్నా, ఢిల్లీ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శనతో విజయాన్ని ఖాయం చేశారు.ప్రారంభంలో ఢిల్లీ జట్టు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది. తొలి ఓవర్‌లోనే రెండు వికెట్లు కోల్పోగా, రెండో ఓవర్‌లో మూడో వికెట్ చేజార్చుకుంది. 50 పరుగుల వద్ద నాలుగు వికెట్లు కోల్పోయి, 113 పరుగుల వద్ద 6 వికెట్లు చేజార్చుకుంది. ఈ దశలో లక్నో విజయమే ఖాయమని భావించారు. అయితే, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్ మ్యాచ్‌ను పూర్తిగా మార్చేశారు. వారి మెరుపు బ్యాటింగ్ లక్నో బౌలర్లను కకావికలం చేసింది.
ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతూ, ఢిల్లీ జట్టును విజయం దిశగా నడిపించారు.మ్యాచ్ ఉత్కంఠ భరితంగా మారిన వేళ, విప్రజ్ (15 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు, 39 పరుగులు) అవుట్ కాగా, 168 పరుగుల వద్ద అతని వికెట్ పడింది. 171 పరుగుల వద్ద మిచెల్ స్టార్క్, 192 పరుగుల వద్ద కుల్దీప్ యాదవ్ పెవిలియన్ చేరడంతో ఢిల్లీ ఓటమి అతి దగ్గరగా ఉందని అనిపించింది. కానీ, అశుతోష్ పట్టుదలతో నిలిచి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.అశుతోష్ 31 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 66 పరుగులు చేసి మ్యాచ్ హీరోగా నిలిచాడు. లక్నో బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, మణిమరన్ సిద్ధార్థ్, దిగ్వేష్ రాఠీ, రవి బిష్ణోయ్ తలా రెండు వికెట్లు సాధించారు. అసాధారణ ప్రదర్శన చేసిన అశుతోష్ శర్మ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును దక్కించుకున్నాడు.ఇక ఐపీఎల్‌లో తదుపరి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య హోరాహోరీ పోరు జరగనుంది.