తిరువనంతపురం : పతంజతి ఆయుర్వేద్ ప్రజలను తప్పుదోవపట్టించే ప్రకటనలు ఇస్తోందని దాఖలైన ఫిర్యాదుపై కేరళలోని పాలక్కడ్ జిల్లా కోర్టు బాబా రామ్‌దేవ్, ఆయన సన్నిహితుడు ఆచార్య బాలకృష్ణలపై బెయిలబుల్ వారంట్లు జారీ చేసింది. కేరళకు చెందిన ఓ వైద్యుడు మూడేళ్ల క్రితమే ఈ అంశంపై కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కేరళలో పది కేసులు, ఉత్తరాఖండ్‌లో ఒక కేసు నమోదయ్యాయి.
కన్నూర్‌కు చెందిన ఆఫ్తమాలజిస్ట్ కెవి బాబు దాఖలు చేసిన పలు ఫిర్యాదులను పురస్కరించుకొని కేరళ ఔషధ నియంత్రణ విభాగం రాష్ట్రంలోని తన కార్యాలయాలన్నింటికీ ఆదేశాలు జారీ చేసింది. 1954 డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమిడీస్ (అభ్యంతరకర ప్రకటనలు) చట్టాన్ని ఉల్లంఘించినందుకు పతంజలిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని సూచించింది. కొన్ని పతంజలి ఆయుర్వేద ఉత్పత్తులు బిపి, సుగర్ వ్యాధులను నయం చేస్తాయని, ఇతర ఆరోగ్య సమస్యలను కూడా తీరుస్తాయని వ్యాపార ప్రకటనలు ఇచ్చారు. ఇలాంటి ప్రకటనలు జారీ చేయడాన్ని డిఎంఆర్ చట్టం నిషేధిస్తోంది.