అర్జెంటీనా : ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నుంచి వైదొలుగుతున్నట్లు అర్జెంటీనా తాజాగా ప్రకటించింది. అధ్యక్ష ప్రతినిధి మాన్యుయెల్ అడోర్నీ ఓ సమావేశంలో ప్రసంగిస్తూ.. ఈ మేరకు ప్రకటన చేశారు. అర్జెంటీనా ఏ అంతర్జాతీయ సంస్థను తన సార్వభౌమాధికారంలో జోక్యం చేసుకోవడానికి అనుమతించబోదని స్పష్టం చేశారు. డబ్లూహెచ్‌వో స్వతంత్రంగా పని చేయడం లేదని, దాని నిర్ణయాలు బాహ్య ఒత్తిడికి లోబడి ఉంటాయని ఆరోపించారు. మానవ చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన కొవిడ్ సమయంలో డబ్లూహెచ్‌వో సరిగా పని చేయలేదని తెలిపారు. కొవిడ్ మహమ్మారిని కట్టడికిచేయడంలో విఫలం, ఇతర కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు అర్జెంటీనా అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది.

కాగా, అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వెంటనే డొనాల్డ్ ట్రంప్ సంచనల నిర్ణయం ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) నుంచి తప్పుకుంటున్నట్లు ఆదేశాలు ఇచ్చారు. వాస్తవానికి ప్రపంచ ఆరోగ్య సంస్థకు అమెరికా అవసరం చాలా ఉందని, కానీ ఏం జరుగుతుందో చూద్దామని ట్రంప్ అన్నారు. ఒకవేళ వీలైతే మళ్లీ డబ్ల్యూహెచ్‌వోలో కలిసే అవకాశాలు ఉన్నట్లు కూడా ఆయన చెప్పారు. కొవిడ్-19ను నియంత్రించడంలో డబ్ల్యూహెచ్‌వో విఫలమైందని, చైనాలోని వుహాన్ నుంచి వ్యాపించిన ఆ వైరస్‌ను పసికట్టడంలో ఆ సంస్థ విఫలమైందని, అవసరమైన సంస్కరణలను చేపట్టలేకపోయిందని, సభ్య దేశాల నుంచి రాజకీయ ఐకమత్యాన్ని తీసుకురావడంలో అసమర్థంగా వ్యవహరించినట్లు ట్రంప్ ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ మేరకు జెనీవాకు చెందిన ఆ సంస్థ సభ్యత్వం నుంచి వైదొలుగుతున్నట్లు వెల్లడించారు.
ఇక, ప్రపంచ ఆరోగ్య సంస్థ పనితీరుపై ప్రపంచ దేశాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. ముఖ్యంగా ప్రపంచాన్ని గడగడలాడించిన కొవిడ్-19 సమయంలో డబ్ల్యూహెచ్‌వో సరైన రీతిలో వ్యవహరించలేదన్న విమర్శలు ఉన్నాయి. చైనాలోని వుహాన్ నుంచి వ్యాపించిన ఆ వైరస్‌ను పసికట్టడంలో ఆ సంస్థ విఫలమైందని ప్రపంచ దేశాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌వో నుంచి వైదొలుగుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికా ఇప్పటికే తన నిర్ణయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.