జగన్‌పై అనర్హత వేటు పడుతుందని, పులివెందులకు ఉప ఎన్నిక వస్తుందని కూటమి నేతలు వ్యాఖ్యానిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి స్పందిస్తూ, సూపర్ సిక్స్ రెఫరెండంతో కుప్పం, పిఠాపురం, మంగళగిరి నియోజకవర్గాల్లో ఎన్నికలకు మీరు సిద్ధమా? అని కూటమి ప్రభుత్వానికి సవాల్ విసిరారు. సూపర్ సిక్స్ పథకాల అమలులో ప్రభుత్వం విఫలమైందని, దీనివల్ల ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుందని తెలిపారు. కడపలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు
అసెంబ్లీలో వైసీపీ సభ్యులు సంధించే ప్రశ్నలకు భయపడే ప్రభుత్వం వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని అవినాశ్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీల్లో వైసీపీ మాత్రమే నిజమైన ప్రతిపక్షమని, 11 సీట్లు ముఖ్యం కాదని స్పష్టం చేశారు. అసెంబ్లీలో ఉన్న నాలుగు పార్టీల్లో మూడు ప్రభుత్వంలో భాగమైనందున, మిగిలిన ఏకైక పార్టీ అయిన వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా మోసం చేస్తోందని మండిపడ్డారు.
పాలనలో వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రజల విశ్వాసం ప్రభుత్వంపై తగ్గిపోతోందని, పాలనలో వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అవినాశ్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం కంటే రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించారు. ప్రజలకు వాస్తవ పరిస్థితులను వివరించేందుకు వైసీపీ నిరంతరం ప్రయత్నిస్తుందని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే తమ లక్ష్యమని తెలిపారు. ప్రజల ఆకాంక్షలను గౌరవించి, పారదర్శక పాలన అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు.