ఆర్సిలర్ మిట్టల్ ఉక్కు పరిశ్రమ ఏపీకి వరం
రాష్ట్రానికి ప్రపంచ ప్రఖ్యాత ఆర్సిలర్ మిట్టల్ ఉక్కు పరిశ్రమ రాబోతోందని, దీనివల్ల పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కలుగనున్నాయని పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ ప్రకటించారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మాట్లాడుతూ, మంత్రి నారా లోకేష్ కృషి వల్లే అనకాపల్లి జిల్లా, నక్కపల్లి మండలంలో ఆర్సిలర్ మిట్టల్ ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు మార్గం సుగమం అయిందని వివరించారు.
భారీ పెట్టుబడులు – లక్ష ఉద్యోగాలు
ఈ పరిశ్రమ కోసం రూ.1,47,162 కోట్ల పెట్టుబడి ప్రతిపాదించబడింది. మొదటి దశలో రూ.61,780 కోట్లు, రెండో దశలో రూ.85,382 కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపారు. దీనివల్ల ఏకంగా లక్ష మందికి పైగా ఉద్యోగావకాశాలు అందుబాటులోకి రానున్నాయి. 17.8 ఎంటిపిఏ సామర్థ్యంతో రెండు దశల్లో (మొదటి దశలో 7.3 ఎంటిపిఏ, రెండో దశలో 10.5 ఎంటిపిఏ) ఉక్కు కర్మాగారం నిర్మించనున్నారు.
ఒడిశా నుంచి ఏపీకి మళ్లిన ప్రాజెక్ట్
ముందుగా ఒడిశాలో ఈ పరిశ్రమను పెట్టాలని ఆలోచన జరిగిందని మంత్రి గుర్తు చేశారు. అయితే 2018లో దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో నారా లోకేష్ ఆదిత్య మిట్టల్‌ను కలిసి ఈ ప్రాజెక్టును ఏపీలో పెట్టేలా చర్చించారని వెల్లడించారు.
కొత్త ప్రభుత్వంతో ప్రగతి
2019లో ప్రభుత్వం మారిన తర్వాత ఈ పరిశ్రమ రాష్ట్రానికి రాలేదని, మళ్లీ ఇప్పుడు ఎన్డీయే హయాంలో తాము అధికారంలోకి రాగానే, ఒకే ఒక్క జూమ్ కాల్‌లో నారా లోకేష్ మళ్లీ ఆదిత్య మిట్టల్‌ను ఒప్పించి ఏపీలో పరిశ్రమను స్థాపించేందుకు రాజీ చేయగలిగారని మంత్రి తెలిపారు.
దేశంలోనే అతిపెద్ద ఉక్కు పరిశ్రమ
చంద్రబాబు నాయుడు నాయకత్వం, ఎన్డీయే ప్రభుత్వ విశ్వసనీయత వల్లే ఈ ప్రాజెక్ట్ సాధ్యమైనట్లు మంత్రి పేర్కొన్నారు. ఇది దేశంలోనే అతిపెద్ద ఉక్కు పరిశ్రమగా నిలవనున్నదని, ఇటీవల దావోస్ సమావేశంలో కూడా ఏపీని బలంగా ప్రోత్సహించామని, పెట్టుబడిదారులకు రాష్ట్రంలోని అవకాశాలను వివరించామని తెలిపారు.