అంతర్జాతీయంగా వాణిజ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, ఆపిల్ ఓ సంచలనాత్మక నిర్ణయానికి సిద్ధమవుతోంది. అమెరికా మార్కెట్ కోసం అవసరమయ్యే ఐఫోన్ల తయారీని పూర్తిగా భారత్‌కి తరలించాలనే లక్ష్యాన్ని ఈ టెక్ దిగ్గజం ముందుంచింది. అందుబాటులోకి వచ్చిన సమాచారం ప్రకారం, 2026 నాటికి అమెరికాలో విక్రయించే ప్రతి ఐఫోన్ కూడా భారత్‌లో తయారవుతుంది.ఇటీవల అమెరికా-చైనా మధ్య వాణిజ్య సంబంధాలు రోజురోజుకీ ముదురుతున్నాయి. ఇరు దేశాలు ఒకదానిపై మరొకటి భారీ దిగుమతి సుంకాలను విధించుకుంటున్నాయి. ఈ వాణిజ్య పోరుతో చైనా నుంచి అమెరికాకు వస్తున్న ఐఫోన్లపై 145% వరకు పన్నులు పడే అవకాశముంది. ఇది ఆపిల్‌కి లాభాలను కుర్చోనివ్వక పోవడమే కాదు, వినియోగదారులపై ధర భారం పెంచేలా చేస్తుంది.దీనికి ప్రత్యామ్నాయంగా, భారత్‌లో తయారీ విస్తరణే సరైన దారిగా ఆపిల్ భావిస్తోంది. ఇకపై చైనాను వదిలేసి, భారత మార్కెట్‌పై మరింతగా దృష్టి సారించేందుకు కంపెనీ సిద్ధమవుతోంది.

భారత్‌కి పెరుగుతున్న ప్రాధాన్యం
ఇప్పటి వరకు ఆపిల్ తయారీ కేంద్రాల్లో చైనా ఆధిపత్యం చూపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా తయారయ్యే ఐఫోన్లలో 80 శాతం చైనాలోనే తయారవుతున్నాయి. భారత్ వాటా కేవలం 14 శాతం మాత్రమే. అయితే, 2020లో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన PLI పథకం (ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్) ఆపిల్‌కి ఆకర్షణగా మారింది.ఈ పథకం అనంతరం, భారత్‌లోని తయారీ యూనిట్లను వేగంగా అభివృద్ధి చేసింది. ముఖ్యంగా ఫాక్స్‌కాన్, విస్ట్రాన్, పెగాట్రాన్ వంటి కంపెనీలు భారత ఐఫోన్ అసెంబ్లింగ్‌లో కీలక పాత్ర పోషిస్తున్నాయి.
దూకుడుగా పెరుగుతున్న ఉత్పత్తి
గత ఆర్థిక సంవత్సరం ఒక్కటే తీసుకున్నా, భారత్‌లో తయారైన ఐఫోన్ల విలువ 22 బిలియన్ డాలర్లు. ఇందులో 18 బిలియన్ డాలర్ల విలువైన ఫోన్లు విదేశాలకు ఎగుమతి కావడం విశేషం. ఇది ఆపిల్ భారత వ్యాపార విస్తరణకు నిదర్శనం.భవిష్యత్తులో అమెరికాలో అమ్ముడయ్యే ఐఫోన్లపై ‘Made in India’ అని ముద్రపడే రోజులు దూరంలో లేవు. ఇది ప్రధాని మోదీ ఊహించిన ‘మేక్ ఇన్ ఇండియా’ దిశగా ఓ మైలురాయి కావొచ్చు.వాణిజ్య ఉద్రిక్తతలు, పెరుగుతున్న ఉత్పత్తి ఖర్చులు, చైనా మీద ఆధారాన్ని తగ్గించాలన్న ఆవశ్యకత… ఇవన్నీ కలిపి ఆపిల్‌ను భారత్ వైపు మళ్లించాయి.
Read Also : Instagram : ఇన్ స్టాగ్రామ్ లో ఈ కొత్త ఫీచర్