ముస్లిం ఉద్యోగులు ఇబ్బంది పడకుండా ఈ నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముస్లిం ఉద్యోగులకు శుభవార్త అందించింది. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని, ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులకు విధుల నుంచి గంట ముందుగా వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రిమండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుని, అధికారులకు తగిన సూచనలు చేశారు.
మార్చి 2వ తేదీ నుంచి మార్చి 30వ తేదీ వరకు అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ముస్లిం ఉద్యోగులు గంట ముందుగానే ఇళ్లకు వెళ్లేందుకు అవకాశం కల్పించారు. ఉపాధ్యాయులు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో పాటు ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకూ ఈ వెసులుబాటు వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. రంజాన్ మాసంలో ఉపవాస దీక్షల కారణంగా ముస్లిం ఉద్యోగులు ఇబ్బంది పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

ఇక ముస్లింలకు మరో శుభవార్తగా, రంజాన్ తోఫా పథకాన్ని కూడా సీఎం చంద్రబాబు మళ్లీ ప్రారంభించాలని నిర్ణయించారు. గతంలో టీడీపీ ప్రభుత్వం సంక్రాంతి, రంజాన్ పండుగల సందర్భంగా నిత్యావసర వస్తువులను అందించింది. అయితే, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాలను నిలిపివేసింది. ఇప్పుడు మళ్లీ టీడీపీ ప్రభుత్వం తిరిగి తీసుకురానుంది.
అంతేకాకుండా, ముస్లిం మతపెద్దలు ఇమామ్, మౌజమ్‌లకు వేతనాలను త్వరగా విడుదల చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అదేవిధంగా, విజయవాడలో హజ్ హౌస్ నిర్మాణాన్ని చేపట్టాలని అధికారులకు సూచనలు అందించారు. ముస్లిం మైనారిటీల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, రంజాన్ మాసంలో వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.